
- ఆరోగ్య రంగంలో దేశానికి 52 మార్కులే
- 92 మార్కులతో కేరళ తొలి స్థానం
- సర్కార్ దవాఖానల్లో రోగులకు సరిపోని బెడ్లు
హైదరాబాద్, వెలుగు: ఆరోగ్య రంగంలో ఇండియా ఆశించినంత వేగంగా ముందుకు సాగడంలేదు. గురువారం విడుదలైన ఎకనామిక్ సర్వే ఈ విషయాన్ని స్పష్టం జేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య రంగం అభివృద్ధిలో ఇండియా కేవలం 52 మార్కులే సాధించినట్టు సర్వే వెల్లడించింది. ఎప్పటిలాగే దేశంలో 92 మార్కులతో కేరళ తొలిస్థానంలో నిలవగా, తమిళనాడు77 మార్కులతో రెండో స్థానంలో నిలిచింది. 73 మార్కులతో తెలంగాణ మూడో స్థానానికి చేరుకుంది. పంజాబ్(71), కర్నాటక(69), ఆంధ్రప్రదేశ్(68) మార్కులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మలేరియా కేసుల్లో పదో స్థానం
స్వచ్ఛ భారత్ అమలు తర్వాత దేశంలో డయేరియా, మలేరియా వంటి వ్యాధులు తగ్గాయని సర్వే తెలిపింది. 2015 మార్చి నాటికి ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 1.2 లక్షల మంది ఐదేండ్లలోపు పిల్లలు మలేరియా బారినపడితే, 2019 మార్చి నాటికి ఈ సంఖ్య 19 వేలకు తగ్గింది. 2015 మార్చిలో 18 వేల మలేరియా కేసులతో తెలంగాణ ఏడో స్థానంలో నిలిస్తే, 2019 మార్చి నాటికి 2 వేల కేసులతో 3 స్థానాలు మెరుగుపర్చుకొని 10వ స్థానానికి చేరుకుంది.
10 లక్షల మందికి 495 బెడ్లే
దేశంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల సంఖ్యకు, జనాభాకు పొంతన లేదు. 2016 నాటికి దేశంలో ప్రతి 10 లక్షల మందికి గవర్నమెంట్ హాస్పిటళ్లలో 495 బెడ్లు మాత్రమే ఉన్నట్టు ఎకనామిక్ సర్వే తెలిపింది. ఈ సంఖ్య 2021 నాటికి 470కి, 2031 నాటికి 435కు, 2041 నాటికి 420కి పడిపోతుందని అంచనా వేసింది. ఢిల్లీలో అత్యధికంగా ప్రతి 10 లక్షల మందికి 1400 బెడ్లు ఉన్నాయి. 1380 బెడ్లతో హిమాచల్‌ప్రదేశ్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. ప్రతి పది లక్షల జనాభాకు 410 బెడ్లతో తెలంగాణ 14వ స్థానంలో నిలిచింది. 2041 నాటికి ఈ సంఖ్య 395కు తగ్గుతుందని సర్వే పేర్కొంది. ఇక బీహార్(100), ఉత్తరప్రదేశ్(300) చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి.
ఒక్క బిడ్డే ముద్దంటున్నారు
తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది. ఒక్కరు చాలు అనుకునే జంటల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2001లో ఇండియాలో సంతానోత్పత్తి రేటు 3.1 ఉంటే, 2011 నాటికి 2.4కు, 2016 నాటికి 2.3కు తగ్గింది. ఇది 2021 నాటికి 1.8కి, 2031 నాటికి 1.7కు పడిపోయి.. 2041 వరకూ అదే స్థాయిలో కొనసాగుతుందని ఎకనామిక్ సర్వే అంచనా వేసింది. ఇక తెలంగాణ 2001లో సంతానోత్పత్తి రేటు 2.3 ఉంటే, 2011 నాటికి 1.8కి, 2016 నాటికి 1.7కు తగ్గింది. ఇది 2021 నాటికి 1.6 కు పడిపోయి.. 2041 వరకూ అదే స్థాయిలో కొనసాగుతుందని సర్వే పేర్కొంది. 2016 నాటికి ఢిల్లీ, పశ్చిమబెంగాల్ 1.6 సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు 1.7గా ఉంది.