
హైదరాబాద్, వెలుగు: పట్టణ ప్రాంతాల్లోని చిన్న సైజు ప్లాట్లలో ఇందిరమ్మ ఇండ్లను జీ+1 పద్ధతిలోనూ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా..స్థలం ఉన్న వారికి ప్రభుత్వం రూ.5 లక్షలు మంజూరు చేస్తోంది. అయితే, ఇల్లు కనీసం 400 చదరపు అడుగులు, గరిష్టంగా 600 చ.అ ఉండాలని షరతు విధించింది.
అయితే, గ్రౌండ్‌ఫ్లోర్‌లో 400 చ.అ నిర్మాణం చేపట్టలేని ప్లాట్లలో జీ ప్లస్ వన్ పద్ధతిలో కట్టుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇస్తూ జీవో 69ను విడుదల చేసింది. కనీస కార్పెట్ ఏరియా 323 చదరపు అడుగులు ఉండాలని స్పష్టం చేసింది. బుధవారం గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
పట్టణ ప్రాంతాల్లోని ఇరుకు స్థలాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు పక్కా ఇండ్ల వసతి కల్పించాలనే ఉద్దేశంతో జీ ప్లస్ 1 ఇండ్లు నిర్మించుకునేందుకు అనుమతిచ్చినట్లు వెల్లడించారు. చాలామంది 60 గజాల స్థలాల్లో రేకుల షెడ్లలో జీవిస్తున్నారని, వారికి ఆర్‌సీసీ స్లాబ్ ఇండ్లను నిర్మించుకునే అవకాశం కల్పించడం ద్వారా ప్రభుత్వ సంకల్పం సాకారమవుతుందన్నారు.