రాజ్యాంగ పీఠికనే మార్చేశారు..ఎస్​సీఈఆర్​టీ, విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం

రాజ్యాంగ పీఠికనే  మార్చేశారు..ఎస్​సీఈఆర్​టీ, విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం

హైదరాబాద్, వెలుగు : రాజ్యాంగానికి ఎంతో కీలకమైన పీఠికనే రాష్ట్ర ప్రభుత్వం మార్చేసింది. సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను పీఠిక నుంచి తొలగించింది. పదో తరగతి సోషల్ స్టడీస్ కవర్ పేజీపై రాజ్యాంగ పీఠికను స్కూల్ ఎడ్యుకేషన్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్​సీఈఆర్​టీ) ముద్రించింది. దీంట్లో సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాల్లేవు. గతేడాది పీఠిక సరిగ్గా ఉన్నా.. ఈఏడాది మాత్రం ఆ పదాలు తీసేసింది. తెలుగు, ఇంగ్లిష్ మీడియం పుస్తకాలపై ఈ పీఠిక ఉంది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో సెక్యు లర్, సోషలిస్ట్ అనే పదాలను చేర్చారు. ఈ ఏడాది సిలబస్ మారలేదు. బుక్ తయారు చేసే ఎడిటోరియల్ మెంబర్స్ టీమ్​లో మార్పుల్లేవు. 

అయినా, రీ డిజైన్ పేరుతో కవర్ పేజీలను మార్చారు. ఈ క్రమంలోనే కనీస అవగాహన లేకుండా ఇంటర్​నెట్ నుంచి రాజ్యాంగ సవరణకు ముందున్న పీఠికను డౌన్​లోడ్ చేసుకుని ప్రింట్ చేసేశారు. కనీసం దాన్ని రీ చెక్ చేయకుండా ప్రింట్ చేయడంపై పలువురు విద్యావేత్తలు, మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రికమండేషన్ల ద్వారా వచ్చినోళ్లతో ఎస్​సీఈఆర్​టీ నిండిపోవడం, ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందనే వాదనలూ వినిపిస్తున్నాయి. కాగా, రాజ్యాంగాన్ని మార్చాలని గతంలో ప్రకటించిన కేసీఆర్.. ఇలా తన పంతాన్ని నెగ్గించుకున్నారా అనే చర్చ ఉపాధ్యాయ వర్గాల్లో జరుగుతున్నది.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : ఉపాధ్యాయ సంఘాలు

రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలు లేకుండా కవర్ పేజీ ప్రింట్ చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్య దర్శులు జంగయ్య, చావ రవి, టీపీటీఎఫ్ రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రటరీ రవీందర్ డిమాండ్ చేశారు. కావాలనే ముద్రించినట్లు అనుమానం వస్తు న్నదని, తప్పుడు ముద్రణకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఈ తప్పుకు నాదే బాధ్యత 

టెన్త్ సోషల్ స్టడీస్ కవర్ పేజీలపై సోషలిస్ట్, సెక్యులర్ పదాలు లేని పీఠికను ముద్రించడం కావాలని చేసింది కాదు. ఈ తప్పుకు నాదే బాధ్యత. సబ్జెక్ట్​ కమిటీ బుక్​లో ఉన్న పాఠాలను చెక్ చేసింది. కానీ, కవర్ పేజీపై ఉన్న పీఠికను గమనించలేదు. ఈసారి కవర్ పేజీ, లోపలి పేజీలను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు పేజీలను రీ డిజైన్ చేశాం. ఈ క్రమంలో వెబ్​సైట్ నుంచి పాత పీఠికను డౌన్​లోడ్ చేసి పెట్టాం.
    
- రాధారెడ్డి, ఎస్​సీఈఆర్​టీ డైరెక్టర్