- పైలట్ ప్రాజెక్టుగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోని
- ఒక టౌన్, ఒక విలేజ్‌లో అమలు: సీఎం రేవంత్
- ఎక్కడైనా రేషన్, ఆరోగ్య సేవలు పొందేలా కార్డు..
- అందులో ఫ్యామిలీ హెల్త్ ప్రొఫైల్
- మార్పులు చేర్పులు చేసుకునేలావెసులుబాటు
- మానిటరింగ్‌కు జిల్లాలవారీగా వ్యవస్థలుఏర్పాటు చేయాలని ఆధికారులకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ‘వన్ స్టేట్.. వన్ డిజిటల్ కార్డు’ విధానంతో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. రేషన్‌కు, హెల్త్ ప్రొఫైల్‌కు, సంక్షేమ పథకాలన్నింటికీ ఉపయోగపడేలా ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపొందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో ప్రతి కుటుం బానికి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసు కొని పైలట్ ప్రాజెక్టు కింద కార్యాచరణను ప్రారంభించాలని ఆదేశించారు. ఈ అంశంపై సోమవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సమీక్షించారు. కుటుంబాల సమగ్ర వివరాల నమోదుతో ఇప్పటికే రాజస్థాన్, హర్యానా, కర్నాటక రాష్ట్రాలు కార్డులు ఇచ్చినందున వాటిపై అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ కార్డులతో కలుగుతున్న ప్రయోజనాలు, ఇబ్బందులపై స్టడీ చేసి సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండాలని, ఈ కార్డులతో లబ్ధిదారులు ఎక్కడైనా రేషన్, ఆరోగ్య సేవలు పొందేలా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతి కుటుంబ సభ్యుని హెల్త్ ప్రొఫైల్ ఉండాలని, అది దీర్ఘకాలంలో వైద్య సేవలకు ఉపయోగపడుతుందన్నారు. ఆయా కుటుంబ సభ్యులు తమ కుటుంబాల్లోని సభ్యుల మార్పుచేర్పులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకునేలా కార్డు ఉండాలని ఆయన సూచించారు. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వ్యవస్థ మానిటరింగ్‌కు జిల్లాలవారీగా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియానా జడ్ చొంగ్తూ, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, సీఎం కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, సంగీత సత్యనారాయణ, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
