- రాష్ట్ర సర్కారు నిర్ణయం..
- వచ్చే ఏడాది నుంచే అమలుకు యోచన
- డొనేషన్ల దందాకు చెక్ పెడతామని ఇటీవల సీఎం ప్రకటన
- అందుకు తగ్గట్టుగా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కసరత్తు
- వివిధ రాష్ట్రాల్లో బీ కేటగిరీ సీట్ల భర్తీ తీరుపై ఆరా
హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్(బీ కేటగిరీ) కోటా సీట్ల అమ్మకాలకు ఫుల్స్టాప్ పెట్టాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. మెడికల్ సీట్ల మాదిరిగానే ఇంజినీరింగ్ లోనూ బీ కేటగిరీ సీట్లన్నింటినీ మెరిట్ఆధారంగా ఆన్లైన్ లోనే భర్తీ చేయాలని భావిస్తోంది. ప్రైవేటు కాలేజీల డొనేషన్ల దందాకు చెక్ పెడ్తామని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో, అందుకు తగ్గట్టుగా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సరం (2026–27) నుంచి కొత్త విధానం అమలు చేసేందుకు సమాలోచనలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా172 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా, మొత్తం 1.15 లక్షల సీట్లున్నాయి. వీటిలో 151 ప్రైవేటు కాలేజీల పరిధిలోనే సుమారు లక్ష వరకు సీట్లున్నాయి. ఇందులో 30 శాతం అంటే 30 వేల సీట్ల వరకు మేనేజ్ మెంట్ కోటా( బీ కేటగిరీ) కింద కాలేజీల యాజమాన్యాలే భర్తీ చేసుకుంటున్నాయి. నిబంధనల ప్రకారం ఈ సీట్లకు (ఎన్ఆర్ఐ సీట్లు మినహా) కన్వీనర్ కోటా ఫీజులే వసూలు చేయాలి. కానీ పేరెంట్స్, స్టూడెంట్ల బలహీనతలను దృష్టిలో పెట్టుకొని కొన్నేండ్లగా పలు ప్రైవేట్ఇంజినీరింగ్ కాలేజీలు కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులకు భారీగా డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. పేరున్న కాలేజీలు ఏకంగా ఒక్కో సీటుకు రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల దాకా గుంజుతున్నాయి. ఈ వసూళ్లపై విద్యాశాఖ అధికారులతో పాటు సీఎంఓ అధికారులకూ తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి. దీనికితోడు పలు కాలేజీల్లో కొన్ని సంఘాలు కూడా సీట్ల కోసం బెదిరిస్తూ, డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు మేనేజ్ మెంట్లు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలోనే ఈ సీట్ల దందాకు చెక్ పెట్టాలని సర్కారు నిర్ణయించింది.
సీఎం ఆగ్రహంతో కదలిక..
ఇటీవల ప్రైవేట్ కాలేజీల మేనేజ్ మెంట్లు ఫీజు రీయింబర్స్మెంట్బకాయిల కోసమంటూ సమ్మెబాట పట్టాయి. అదేసమయంలో పలు ప్రైవేట్కాలేజీలు నిబంధనలు పాటించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్తనిఖీలకు సర్కారు ఆదేశించింది. దీంతో యాజమాన్యాలు స్టూడెంట్లను ఇండ్లకు పంపి కాలేజీలకు తాళాలు వేశాయి. విషయం తెలిసి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్అయ్యారు. విద్య వ్యాపారం కాదని, సేవ మాత్రమేనని స్పష్టం చేశారు. తాము విడతలవారీగా ఫీజు రీయింబర్స్మెంట్చెల్లిస్తున్నా కొన్ని యాజమాన్యాలు పనిగట్టుకొని సర్కారును బద్నాం చేస్తున్నాయంటూ ఫైర్అయ్యారు. ఇకపై నిబంధనలకు విరుద్ధంగా లక్షల కొద్దీ డొనేషన్లు, ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలను ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దీంతో ఉన్నత విద్యామండలి అధికారుల్లో చలనం మొదలైంది. ప్రస్తుతం కన్వీనర్ కోటాలో ఎంత ఫీజు ఉంటే.. అంతే ఫీజును మేనేజ్ మెంట్ కోటా సీట్లకూ తీసుకోవాల్సి ఉంది. కానీ కాలేజీలు ఈ నిబంధనను పాటించకుండా లక్షల కొద్దీ డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. దీంతో కన్వీనర్ సీట్ల ఫీజులతో పోలిస్తే మేనేజ్మెంట్సీట్ల ఫీజులను కొంత పెంచడమా, లేదంటే ఇప్పటిలాగే అవే ఫీజులు కొనసాగించడమా? అనే విషయమై సమాలోచనలు చేస్తున్నారు. అదేసమయంలో ఇతర రాష్ర్టాల్లో బీ కేటగిరీ సీట్లను ఎలా భర్తీ చేస్తున్నారనే వివరాలను హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారులు పరిశీలిస్తున్నారు. మరోపక్క గతేడాదే బీ కేటగిరీ సీట్లను ఆన్ లైన్లో భర్తీ చేయాలని కౌన్సిల్ అధికారులు సర్కారుకు ప్రతిపాదనలు పంపించారు. కానీ, ప్రభుత్వం అప్పట్లో నిర్ణయం తీసుకోలేదు. తాజాగా మేనేజ్ మెంట్ల దందాలకు చెక్ పెట్టేందుకు ఆన్ లైన్ భర్తీ విధానమే సరైనదని భావిస్తోంది.
మెడికల్ కౌన్సెలింగ్ తరహాలో..
మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటాతో పాటు మేనేజ్‌మెంట్ కోటా ఎంబీబీఎస్ సీట్లను కూడా హెల్త్ యూనివర్సిటీనే భర్తీ చేస్తోంది. ఈ విధానంలో ఎలాంటి డొనేషన్లు లేకుండా నీట్ ర్యాంకుల ఆధారంగానే సీట్లు అలాట్ చేస్తోంది. నీట్ ర్యాంకులు ఉంటేనే ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనేలా కఠిన నిర్ణయం తీసుకున్నది. ఇదే విధానాన్ని ఇంజినీరింగ్ సీట్ల భర్తీలోనూ అమలు చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎప్ సెట్ లో ర్యాంకు రాకపోయినా మేనేజ్ మెంట్ కోటాలో సీట్లు పొందుతున్నారు. కానీ, మెడికల్ అడ్మిషన్ల విధానం అమలు చేస్తే.. ర్యాంకు ఉన్న వారికే మేనేజ్ మెంట్ కోటాలో సీట్లు పొందే అవకాశం ఉంటుంది. తద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించినట్టు అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
