
- బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం
- త్వరలోనే చైర్మన్, సభ్యుల నియామకం
- ప్రతిపాదనలు రెడీ చేసి పంపాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు
- రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు1.60 లక్షల ఎకరాల భూదాన్ భూములు
- భూ భారతి పోర్టల్‌లో ఉన్నది 35 వేల ఎకరాలే?.. చాలాచోట్ల అన్యాక్రాంతం, అక్రమ రిజిస్ట్రేషన్లు
- వాటి నిర్వహణ, పర్యవేక్షణ కోసం బోర్డు ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: గత సర్కారు రద్దు చేసిన భూదాన్ యజ్ఞ బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బోర్డుకు త్వరలోనే చైర్మన్, సభ్యులను నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆధీనంలోనో, పేదల చేతుల్లోనో ఉండాల్సిన వేలాది ఎకరాల భూములను రక్షించడంతోపాటు పర్యవేక్షించే లక్ష్యంతో మళ్లీ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి.
ఇటీవల భూదాన్ భూముల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండడంతో అసలు క్షేత్రస్థాయిలో భూదాన్ భూములు ఎక్కడెక్కడ, ఎన్ని ఎకరాలు, ఎవరి చేతిలో ఉన్నాయి? అనే వివరాలు తెలుసుకోవడవంతోపాటు అన్యాక్రాంతమైన భూములను తిరిగి వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ క్రమంలోనే భూదాన్ యజ్ఞ బోర్డు ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్నది. భూదాన్ యజ్ఞ చట్టం–-1965 ప్రకారం..బోర్డులో చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు మరో 9మంది సభ్యులను ప్రభుత్వం నియమించనున్నది.
వీరి పదవీకాలం సాధారణంగా నాలుగేండ్లు ఉంటుంది. భూదానోద్యమం ద్వారా తెలంగాణలో సుమారు 1.60 లక్షల ఎకరాల భూమి సేకరించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ ప్రస్తుతం భూ భారతి పోర్టల్‌లో కేవలం 35 వేల ఎకరాల రికార్డులే ఉన్నాయి. చాలా భూములు వివిధ కారణాల వల్ల పేదలకు చెందలేదు. మరీ ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీగా అక్రమాలు జరిగాయి. ఈ భూముల్లో ఎక్కువ భాగం హైదరాబాద్చుట్టుపక్కల ఉండడంతో ఎకరా కోట్లలో పలుకుతున్నది.
దీంతో కొందరు రాజకీయనేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ భూములను కబ్జా చేసి, అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. నల్గొండలాంటి కొన్ని జిల్లాల్లో భూములు ఇచ్చిన దాతల వారసులు నిబంధనలకు విరుద్ధంగా భూములను ఆక్రమించుకున్నారు. ఈ తరహాలో అన్యాక్రాంతమవుతున్న భూదాన్ భూములను రక్షించేందుకు, పర్యవేక్షించేందుకు ఇన్నాళ్లూ పటిష్టమైన యంత్రాంగం లేకపోవడంతో సమస్యలు మరింత జటిలమయ్యాయి. కోర్టుల్లో వేల కేసులు పెండింగ్ పడ్డాయి. భూదాన్ భూములపై సమగ్ర సమాచారం కూడా ప్రభుత్వ రికార్డుల్లో అందుబాటులో లేకపోవడంతో భూదాన్బోర్డు ఇందుకు పరిష్కారం చూపిస్తుందనే అంచనాలున్నాయి.
భూ భారతి పోర్టల్‌లో ఉన్నది 35 వేల ఎకరాలేనా?
భూభారతి పోర్టల్‌లో ఉన్న భూదాన్భూములకు, భూదాన్ సెక్షన్‌లో ఉన్న రికార్డులకు సరిపోలడం లేదు. రికార్డుల ప్రకారం లక్షా 60 వేల ఎకరాలకు పైగా భూదాన్ భూములు ఉండగా.. భూ భారతి పోర్టల్‌లో కేవలం 35 వేల ఎకరాల భూమి వివరాలు మాత్రమే నమోదైనట్లు తెలిసింది. ఇంకా లక్షా 30 వేల ఎకరాల భూమి వివరాలు పోర్టల్‌లో చేర్చాల్సి ఉంది. మిగిలిన భూమి ఎవరి ఆధీనంలో, ఎక్కడ ఉంది? అనే దానిపై స్పష్టత లేదు.
ఈ క్రమంలోనే భూదాన్ భూముల నిర్వహణ, పర్యవేక్షణ, వివాదాల పరిష్కారానికి ఒక ప్రత్యేక వ్యవస్థ అవసరమని ప్రభుత్వం భావించింది. ఇప్పటివరకు ఈ భూముల వ్యవహారాలను రెవెన్యూ శాఖ పర్యవేక్షిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది అవినీతి సమస్యగా మారింది. అందుకే భూదాన్ చట్టం ప్రకారం ఒక స్వతంత్ర బోర్డును ఏర్పాటు చేసి, సమగ్ర సర్వే అనంతరం మిగిలిన భూములను కూడా భూభారతి పోర్టల్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
భూదాన్ భూముల సమగ్ర డిజిటల్ సర్వే, పోర్టల్‌లో నమోదుతోపాటు అక్రమ రిజిస్ట్రేషన్లు, కబ్జాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం, పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులను పరిష్కరించడం, ఇప్పటికే అన్యాక్రాంతమైన భూములను విడిపించి, పేదలకు పంపిణీ చేయడం, కొత్తగా ఎలాంటి భూముల అన్యాక్రాంతం కాకుండా రక్షణ కల్పించడంలాంటి విధులను భూదాన్బోర్డుకు కట్టబెట్టనున్నట్టు తెలిసింది.
అర్బన్ ప్రాంతాల్లో వ్యవసాయానికి అనుకూలంగా లేని భూదాన్ భూములను వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించుకునే వీలు కల్పించేలా చట్టంలో సవరణలు చేశారు. దీని ద్వారా పేదలకు ఇండ్ల స్థలాల కేటాయింపునకు లైన్ క్లియర్ అయింది.
భూదాన్ భూములపై ప్రధాన వివాదాలు ఇవీ..
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వే నెం. 181, 182లో ఉన్న సుమారు 102 ఎకరాల భూదాన్ భూమిపై తీవ్ర వివాదం కొనసాగుతున్నది. ఈ భూమిని కొందరు రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఐఏఎస్, ఐపీఎస్‌లాంటి ఉన్నతాధికారులు తమ బంధువులు, కుటుంబ సభ్యుల పేర్లతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భూమిపై ఎలాంటి లావాదేవీలు జరపకూడదని ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ వివాదంపై ఈడీ విచారణ కూడా కొనసాగుతున్నది.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తి పరిధిలో 1955లో భూదాన్ యజ్ఞ బోర్డుకు దానంగా ఇచ్చిన దాదాపు 250 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిందనే ఆరోపణలున్నాయి. ఈ భూమి విలువ వందల కోట్లలో ఉంటుందని అంచనా. ఈ వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి విచారణకు ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేలాది ఎకరాల భూదాన్ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నిరుపేదలకు పంపిణీ చేసిన భూముల్లో 80% పైగా క్రయవిక్రయాలు జరిగాయని, దీనిపై భూదాన్ బోర్డు గతంలో కోర్టుల్లో కేసులు వేసినప్పటికీ అవి ఇంకా పరిష్కారం కాలేదని తెలుస్తున్నది.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల , భూత్‌పూర్ మండలాల్లో వందల ఎకరాల భూదాన్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. లీడర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారుల సాయంతో ఈ భూముల రికార్డులు తారుమారు చేయించి, అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో కొందరు నాయకులు ఆధారాలతో సహా బయటపెట్టినప్పటికీ, వాటిపై చర్యలు తీసుకోలేదు.
భూదాన్ ఉద్యమం ప్రారంభమైన పోచంపల్లిలో భూమి హక్కుల సమస్యలు ఉన్నాయి. దానంగా ఇచ్చిన భూములను తిరిగి ఆక్రమించుకోవడం, పేదలకు సరైన పట్టా హక్కులు లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిపై కూడా కోర్టుల్లో పెద్ద సంఖ్యలో కేసులు నడుస్తున్నాయి.