ధాన్యం కొనుగోళ్ల టెండర్లు అంతంతే

ధాన్యం కొనుగోళ్ల టెండర్లు అంతంతే
  •  గత యాసంగి వడ్లు అమ్మేందుకు టెండర్లు పిలిచిన రాష్ట్ర ప్రభుత్వం
  • అనుకున్నంత స్థాయిలో దాఖలు కాని బిడ్లు 
  •  కొనుగోళ్లల్లో కాంపిటేషన్‌ లేకపోవడంతో డైలమాలో సివిల్ సప్లయ్స్‌
  • వచ్చిన టెండర్లు ఓకే చేస్తే వెయ్యి కోట్ల వరకు నష్టం వచ్చే చాన్స్‌

హైదరాబాద్, వెలుగు: గత యాసంగిలో సేకరించిన ధాన్యాన్ని అమ్మేందుకు కొత్త సర్కార్‌‌కు పెద్ద తలనొప్పిగా మారింది. బీఆర్‌‌ఎస్‌ ప్రభుత్వం నిరుడు యాసంగి వడ్లు మిల్లింగ్‌ చేయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో రాష్ట్రంలోని దాదాపు అన్నీ గోడౌన్‌లు ధాన్యం బస్తాలతో నిండిపోయాయి. ఇప్పుడు ఈ ధాన్యాన్ని అమ్మేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఈ క్రమంలో తొలి విడతగా 35 లక్షల టన్నుల ధాన్యాన్ని అమ్మకానికి పెట్టగా, ఆశించిన స్థాయిలో బిడ్లు దాఖలు కాలేదు. గ్లోబల్‌ టెండర్లు పిలిచినా స్పందన కరువైంది. దీంతో వచ్చిన బిడ్లు ఓకే చేయాలా లేక మళ్లీ టెండర్లు పిలవాలనే దానిపై సివిల్‌ సప్లయ్స్ అధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారు. 

12 లాట్‌లకు 26 బిడ్‌లే వచ్చినయ్‌..

రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరగానే మిల్లుల్లో ఉన్న నిల్వలను అమ్మడంపై ఫోకస్‌ పెట్టింది. తద్వారా సివిల్‌ సప్లయ్స్‌ సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో నిరుడు యాసంగిలో సేకరించిన 35 లక్షల టన్నుల ధాన్యాన్ని ఈ వేలం ద్వారా అమ్మాలని నిర్ణయించింది. ఇందులో 3 లక్షల టన్నుల చొప్పున 11 లాట్లుగా, 1.59 లక్షల టన్నుల సన్న ధాన్యాన్ని ఒక లాట్‌గా విభజించి మొత్తం 12 లాట్లకు గత జనవరి 25న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్‌‌లో మొత్తం ఏడు కంపెనీలు పాల్గొని 12 లాట్లకు 30 బిడ్లు దాఖలు చేసినట్టు తెలిసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ హాకాకు ఈ రంగంలో అర్హత లేని కారణంగా టెండర్లు రిజెక్ట్ అయ్యాయి. దీంతో 6 కంపెనీలకు చెందిన 26 బిడ్లు మాత్రమే పోటీలో నిలిచాయి. సాధారణ ధాన్యానికి సగటున రూ.1,950, సన్న రకం ధాన్యానికి రూ.2,150 వరకు ధర కోట్ చేసినట్టు సమాచారం. 12 లాట్లకు ఇంత తక్కువగా బిడ్లు రావడంతో అధికారులకు ఏం చేయాలో అంతుబట్టకుండా ఉంది. బిడ్‌లలో పెద్దగా పోటీ లేకపోవడంతో తాజా టెండర్లను ఏం చేయాలనేది మల్లా గుల్లాలు పడుతోంది. 

టెండర్లు ఓకే చేస్తే వెయ్యి కోట్ల వరకు నష్టం..

రైతుల నుంచి సివిల్‌ సప్లయ్స్‌ డిపార్ట్‌మెంట్‌ క్వింటాలుకు రూ.2,040-, రూ.2,060 మద్దతు ధరతో వడ్లు కొనుగోలు చేసింది. సేకరించిన వడ్లు కల్లాల నుంచి మిల్లులకు తరలించడం.. అక్కడి నుంచి గోదాములకు తరలించడం.. నెలల తరబడి నిల్వ చేయడంతో స్టోరేజీ, రవాణా ఖర్చులు, కొనడానికి సివిల్‌ సప్లయ్స్‌ తీసుకున్న బ్యాంకు లోన్లకు మిత్తి ఇతర ఖర్చులు కలిపితే క్వింటాలుకు రూ.2,300 వరకు అయిందనే అంచనాలు ఉన్నాయి. తాజాగా టెండర్లలో కోడ్‌ చేసిన ధరతో పోల్చితే క్వింటాలుకు రూ.150 నుంచి రూ.350 వరకు తక్కువ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. టెండర్లు ఓకే చేస్తే క్వింటాలుకు సగటున రూ.300 భారం పడేలా ఉంది. ఈ క్రమంలో  35 లక్షల టన్నుల ధాన్యానికి దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర నష్టం వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు.