
- కేంద్రానికి వేర్ హౌసింగ్ డిపార్ట్‌మెంట్ ప్రతిపాదనలు
- డీపీఆర్‌కు గ్రీన్ సిగ్నల్.. గోదాముల నిర్మాణానికి సన్నాహాలు
- రాష్ట్రంలో కోల్డ్ స్టోరేజీలన్ని ప్రైవేట్ నిర్వహణలోనే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గోడౌన్ల సామర్థ్యాన్ని మరో లక్ష టన్నులకు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేర్‌హౌసింగ్ డిపార్ట్‌మెంట్ తయారుచేసిన డీపీఆర్ ను కేంద్రానికి పంపించగా ఆమోదం లభించింది. దీంతో గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం వేర్‌హౌసింగ్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో 7.2 లక్షల టన్నుల సామర్థ్యం గల గోడౌన్లు ఉన్నాయి. దీనిని క్రమంగా 10 లక్షల టన్నులకు విస్తరించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. నాబార్డ్, ఆర్‌ఐడీఎఫ్ నిధులతో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణం చేపడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వేర్‌హౌసింగ్, సివిల్ సప్లైస్, మార్కెటింగ్ శాఖలు, ఎఫ్‌సీఐ, ప్రైవేట్ గోడౌన్లతో కలిపి 66.65 లక్షల టన్నుల సామర్థ్యం గల గోడౌన్లు ఉన్నాయి. ఈ కెపాసిటీని కోటి టన్నులకు విస్తరించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. వేర్‌హౌసింగ్ డిపార్ట్‌మెంట్ మొదటిసారిగా కోల్డ్ స్టోరేజీ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఖమ్మం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా 10 వేల టన్నుల కెపాసిటీతో కోల్డ్ స్టోరేజీ నిర్మాణం త్వరలో మొదలవనుంది.
కోల్డ్ స్టోరేజీల కొరతతో రైతులకు ఇబ్బందులు
రాష్ట్రంలో కోల్డ్ స్టోరేజీల కొరత వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలను నిల్వ చేయడానికి సౌకర్యం లేకపోవడంతో గిట్టుబాటు ధరలు లభించక దళారుల చేతిలో దోపిడీకి గురవుతున్నారు. ప్రభుత్వ కోల్డ్ స్టోరేజీలు ఉంటే, పంటలకు ధరలు తక్కువగా ఉన్నప్పుడు నిల్వ చేసి, ధరలు పెరిగినప్పుడు విక్రయించే అవకాశం ఉంటుంది. అయితే, వేర్‌హౌసింగ్, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఒక్క కోల్డ్ స్టోరేజీ కూడా లేదు. గత పదేండ్లలో ఈ సమస్యపై ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడం గమనార్హం.
ఫుడ్ ప్రాసెసింగ్‌లో కోల్డ్ స్టోరేజీల కీలక పాత్ర
రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, కోల్డ్ స్టోరేజీల కొరత అభివృద్ధికి అడ్డంకిగా నిలుస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పండ్లు, కూరగాయలలో కేవలం 5 శాతం మాత్రమే ప్రాసెసింగ్‌కు గురవుతున్నాయి. కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో ఉంటే, రైతులు తమ పంటలను నిల్వ చేసి, గిట్టుబాటు ధరలకు విక్రయించవచ్చు. ఉదాహరణకు, మిర్చి ధరలు పడిపోయినప్పుడు, కొందరు రైతులు ప్రైవేట్ కోల్డ్ స్టోరేజీలలో నిల్వ చేసి డిమాండ్ పెరిగినప్పుడు అధిక ధరలకు విక్రయించారు.
కూరగాయలు, ఉల్లి నిల్వ సమస్య
ఉల్లిలో 85% నీరు ఉండటంతో, ఉష్ణోగ్రతలు పెరిగితే 25% –30 % బరువు తగ్గిపోతుంది. సాధారణ గోడౌన్లలో 3 నుంచి 5 శాతం ఉల్లి వృథా అవుతుంది. ఆధునిక కోల్డ్ స్టోరేజీలలో 4 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తే ఈ నష్టం గణనీయంగా తగ్గుతుంది. కూరగాయల దిగుబడి అధికంగా ఉన్నప్పుడు నిల్వ సౌకర్యం లేకపోవడంతో, రైతులు తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తున్నది. మార్కెట్‌లలో కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేస్తే, ఈ సమస్యలను అధిగమించవచ్చని రైతులు సూచిస్తున్నారు.