బీసీ రిజర్వేషన్లపై.. సర్కారు న్యాయ పోరాటం

బీసీ రిజర్వేషన్లపై.. సర్కారు  న్యాయ పోరాటం
  • ఢిల్లీలో సుప్రీంకోర్టు అడ్వకేట్​ సింఘ్వీతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల సుదీర్ఘ భేటీ
  • రిజర్వేషన్ల అమలులో న్యాయపర చిక్కుల పరిష్కారాలపై మంతనాలు
  • తమిళనాడు తరహాలో రాష్ట్రంలో అమలుపై చర్చ

న్యూఢిల్లీ, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా సోమవారం ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు, కాంగ్రెస్ నేతల బృందం సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్, న్యాయ కోవిదుడు అభిషేక్ మను సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమైంది. భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు ఉత్తమ్​కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తదితరులు పాల్గొన్నారు.

 సుమారు గంటపాటు సాగిన ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అమలులో న్యాయపర అడ్డంకులపై సుదీర్ఘంగా చర్చించారు. 50 శాతం రిజర్వేషన్లు దాటొద్దన్న సుప్రీంకోర్టు తీర్పులు, చట్టాలకు భిన్నంగా తమి   ళనాడులో ప్రస్తుతం అమలవుతున్న 69 శాతం రిజర్వేషన్లపై చర్చించారు.  అలాగే, ఈడబ్ల్యూఎస్ పేరుతో అగ్రవర్ణాలకు కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లు ఎలా సాధ్యమయ్యాయని సింఘ్వీని అడిగి తెలుసుకున్నారు. 

తాజాగా, బిహార్‌‌‌‌లో రిజర్వేషన్లు పెంచుకునేందుకు గవర్నర్ ఆమోదం, ఇతర రాష్ట్రాల్లోనూ పెండింగ్‌‌లో ఉన్న రిజర్వేషన్ల అంశాలపై చర్చించారు.  బీసీ బిల్లుల ఆమోదించి.. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌‌లో  చేర్చకుండా.. తెలంగాణలోని బీసీలకు న్యాయం చేయడం ఎలా అన్న కోణంలో న్యాయసలహాలు తీసుకున్నారు. అలాగే, రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని కేసీఆర్ తెచ్చిన పంచాయతీరాజ్ చట్టంపై  ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన రెండు బిల్లుల ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా న్యాయపోరాటం చేయడంపై మంతనాలు జరిపారు.    

అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం: భట్టి

42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందుకు సుప్రీంకోర్టు న్యాయ కోవిదుల సలహాలు కూడా తీసుకుంటామని చెప్పారు. సింఘ్వీతో భేటీకి ముందు, తర్వాత భట్టి మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించామని చెప్పారు. ఆ బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌‌లో ఉన్నాయని తెలిపారు. 

 సెప్టెంబర్‌‌‌‌లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు డెడ్‌‌లైన్​ పెట్టిందన్నారు.  అభిషేక్‌‌ మను సింఘ్వీ, జస్టిస్‌‌ సుదర్శన్‌‌ రెడ్డి సలహాలు తీసుకుంటున్నామని, వాటిని అమలు చేసేందుకు కృత నిశ్చయంతో పనిచేస్తున్నామని, రిజర్వేషన్ల అంశంపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని సింఘ్వీ తమకు సూచించారని తెలిపారు. తమ కమిటీ నివేదికను 29న జరిగే రాష్ట్ర కేబినెట్‌‌కు అందజేస్తామని చెప్పారు.  

కేసీతో రేవంత్, భట్టి, మంత్రులు భేటీ

బిహార్‌‌‌‌లో అగ్రనేత రాహుల్‌‌గాంధీ చేపట్టిన ‘ఓట్ అధికార్​ యాత్ర’లో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా తుగ్లక్ రోడ్ లోని తన అధికారిక నివాసానికి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాత్రి 8 గంటలకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.  ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల అమలుపై చర్చించినట్లు తెలిసింది.  

నేడు బిహార్ కు సీఎం 

ఓట్ల చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి ఉదయం 6 గంటలకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి, పొన్నం ప్రభాకర్, ఇతర పార్టీ ముఖ్య నేతలతో కలిసి బిహార్ వెళ్తారు. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు రాహుల్‌‌తో కలిసి యాత్రలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు బిహార్ నుంచి సీఎం నేరుగా హైదరాబాద్ చేరుకుంటారని సీఎంవో వర్గాలు తెలిపాయి. 

జస్టిస్ సుదర్శన్‌‌రెడ్డిని కలిసిన మంత్రుల బృందం

ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రుల బృందం సోమవారం ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఇందులో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు.