గ్రీన్​ఫార్మాసిటీ రైతులకు పెట్టుబడి సాయం

గ్రీన్​ఫార్మాసిటీ రైతులకు పెట్టుబడి సాయం

దరఖాస్తు చేసుకుంటే అర్హులకురైతుబంధు ఇస్తం
హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలోనే హైదరాబాద్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 2016లో జారీ చేసిన జీవో 31 అమలుకు కట్టుబడి ఉన్నట్టు చెప్పింది. ఇందుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ అమల్లోనే ఉన్నదని స్పష్టం చేసింది. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని, మార్కెట్‌‌‌‌ ధరకు అనుగుణంగా పరిహారం చెల్లింపుపై రైతులతో చర్చలు చేస్తున్నట్టు చెప్పింది.

 ఫార్మా సిటీకి సంబంధించిన భూసేకరణ అవార్డు నోటిఫికేషన్‌‌‌‌ను రద్దు చేస్తూ గతంలో సింగిల్‌‌‌‌ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేయాలని డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ వద్ద  అప్పీల్‌‌‌‌ దాఖలు చేసినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ భూములకు సంబంధించిన రైతులు దరఖాస్తులు ఇస్తే.. రైతు బంధు, పంట రుణాలు, ఇతర పథకాలకు అనుమతిచ్చేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చింది. ఈ మేరకు అడ్వకేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ సుదర్శన్‌‌‌‌రెడ్డి ఇచ్చిన హామీని హైకోర్టు రికార్డుల్లో నమోదు చేసింది. 

సింగిల్‌‌‌‌ జడ్జి తీర్పు మేరకు తమ భూమిపై నిషేధిత ఉత్తర్వులు తొలగించాలని, ధరణి పోర్టల్​లో లావాదేవీలు జరిపేందుకు అనుమతించాలంటూ రైతులు దాఖలు చేసిన పలు పిటిషన్లను జస్టిస్‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌ సోమవారం విచారించారు. పిటిషనర్లను రైతు బంధుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. వారంలోగా పిటిషనర్లు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతులకు పంట రుణాలు, రైతు బంధు వంటి పథకాల కోసం చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి, వాటిపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జస్టిస్​కె.లక్ష్మణ్​ఆదేశించారు. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.