గాంధీ దవాఖాన పరిస్థితులపై..హెచ్ఆర్సీ సీరియస్

గాంధీ దవాఖాన పరిస్థితులపై..హెచ్ఆర్సీ సీరియస్
  • అక్టోబర్​ 27లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో దారుణమైన పరిస్థితులపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం సీరియస్ అయ్యింది. ఏడాది కాలం నుంచి లిఫ్టులు సరిగా పనిచేస్తుండకపోవడంతో డాక్టర్లు, పేషెంట్లు, నర్సులు, మెట్లు ఇబ్బందులు పడుతున్నారని సిటీకి చెందిన ప్రముఖ అడ్వకేట్​ రామారావు ఇమ్మానేని గతంలో హెచ్ఆర్సీని ఆశ్రయించారు. 

వంటగదుల్లో జిర్ర పురుగులు తిరుగుతున్నాయని, పేషంట్లు పడుకునే బెడ్లు నాణ్యతగా లేవని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని మీడియాల్లో కథనాలు వస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఆసుపత్రికి చెందిన డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా తయారైందన్నారు. 

మార్చురీలో రోజుల తరబడిగా శవాలు పేరుకుపోతుండడంతో పూర్తిగా కుళ్లిపోయి దుర్వాసనతో పద్మారావునగర్​ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇటీవల తరచుగా ఆసుపత్రి ప్రధాన విభాగాలు, అత్యవసర వైద్య సేవలు అందించే ఎమర్జెన్సీ బ్లాకుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, హాస్పిటల్లో కుక్కల బెడద కూడా ఎక్కువగా ఉందన్నారు. 

తక్షణమే గాంధీలో నెలకొన్న దారుణ పరిస్థితులపై సమీక్షించి, చర్యలు తీసుకోనేలా వైద్యారోగ్య శాక ప్రిన్సిపల్​సెక్రటరీ క్రిస్టినా జడ్​ చోంగ్తూకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్​ లో కోరారు.  దీంతో  న్యాయవాది రామారావు పిటిషన్​ ను మానవ హక్కుల కేసు 4051/2025 గా నమోదు చేసి ఆగస్ట్ 2న విచారణకు స్వీకరించింది. అక్టోబర్​ 27 లోగా  సమగ్ర నివేదిక సమర్పించాలని ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్​ కు నోటీసును ఇచ్చినట్లు అడ్వకేట్​ రామారావు తెలిపారు.