
పార్లమెంట్ ఎన్నికల్లో తమకు ఎవరూ పోటీ లేరన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ మెదక్ లో నిర్వహించిన TRS పార్లమెంట్ స్థాయి సన్నాహక సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. తమలో తమకే మెజార్టీ విషయంలో పోటీ ఉందన్నారు. సీఎం ప్రతినిధ్యం వహిస్తున్న మెదక్ నియోజకవర్గం కంటే… కరీంనగర్ నియోజకవర్గంలో మెజార్టీ ఎక్కువ సాధిస్తామన్నారు. కేంద్రంలో NDA, UPA పరిస్థితి బాగోలేదన్నారు KTR. రాష్ట్రంలో 16 స్థానాలు గెలిచి.. ఢిల్లీలో హవా చూపించాలన్నారు.
‘‘2014లో పూర్తి మెజార్టీతో ప్రజలు మోడీని గెలిపిస్తే చేసిందేమీ లేదు. మోడీ నోట్ల రద్దు చేసి అందర్నీ వీధిన పడేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పార్టీలకే నిధులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లేని పార్టీలకు నిధులు ఇవ్వలేదు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని అడిగితే ఇవ్వలేదు. తెలంగాణ కూడా నిర్ణయాత్మక శక్తిగా ఉంటే నిధులు వాటంతట అవే వస్తాయి. తెలంగాణ పథకాలకు కేంద్రం నుంచి ప్రశంసలే తప్ప నిధులు రాలేదు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. అయినా కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు. మోడీ పాలన పట్ల దేశవ్యాప్తంగా విముఖత వచ్చింది. రైతులకు మేలు చేసే పథకాలను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ చేపట్టలేదు. తెలంగాణ ‘రైతు బంధు’ను ఇప్పుడు కేంద్రం, చాలా రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి. కేసీఆర్ ను విమర్శించే చంద్రబాబు కూడా ఈ పథకాన్ని కాపీ కొట్టారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా కేసీఆర్ నడిపిస్తున్నారు. TRS అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలి’’ అని కోరారు కేటీఆర్.