దామన్న కృషితోనే తుంగతుర్తికి ఎస్సారెస్పీ నీళ్లు ..మాజీ మంత్రి దామోదర్ రెడ్డి సంతాప సభలో మంత్రులు

దామన్న కృషితోనే తుంగతుర్తికి ఎస్సారెస్పీ నీళ్లు ..మాజీ మంత్రి దామోదర్ రెడ్డి సంతాప సభలో మంత్రులు
  •  పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
  • కాంగ్రెస్ ను జిల్లాలో నిలబెట్టిన నాయకుడు దామోదర్ రెడ్డి : మంత్రి ఉత్తమ్ 
  • దామోదర్ రెడ్డి కృషితోనే ఎస్సారెస్పీ ఫేజ్ – 2 పూర్తి : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి 

సూర్యాపేట, వెలుగు: మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కృషితోనే తుంగతుర్తికి ఎస్సారెస్పీ నీళ్లు వచ్చాయని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం తుంగతుర్తిలో దామోదర్ రెడ్డి సంతాపసభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..  ఉమ్మడి నల్గొండ  జిల్లాలో 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన నాయకుడు దామోదర్ రెడ్డి అన్నారు.  

వైఎస్సార్  పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో ఉమ్మడి జిల్లా నాయకులంతా కలిసి తుంగతుర్తిలో పర్యటించి రక్తతర్పణం కార్యక్రమం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. శ్రీరాంసాగర్ నీటిని తుంగతుర్తికి తీసుకురావడంతో దామోదర్ రెడ్డి కృషి మరువలేనిదన్నారు. ఆయన కృషి ఫలితంగానే ఎస్సారెస్పీ ఫేజ్ -2  పూర్తయిందన్నారు. ఎస్సారెస్పీ ఫేజ్ 2కి ఆర్డీఆర్ ఎస్సారెస్పీ పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.

 దామోదర్ రెడ్డి కోరిక మేరకు దెబ్బతిన్న ఎస్సారెస్పీ కాలువల రిపేర్లు చేయిస్తామని ప్రకటించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా ఒక తాటిపై ఉండి దామన్న ఆశయాలను నెరవేరుస్తామన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి దామన్నకు ఘనమైన నివాళి అర్పిస్తామని తెలిపారు.   ఓ కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిని కోల్పోయామని అలాంటి గొప్ప నాయకుని కోల్పోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. 

దామోదర్ రెడ్డి తనయుడికి కాంగ్రెస్ అండగా ఉంటుందని, భవిష్యత్ లో రాజకీయంగా ఆయనకు పార్టీ ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు.  కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్, మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్సీలు  శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, సూర్యాపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి పాల్గొన్నారు.