- సభ్యులతోపాటు ఐదుగురు నామినేటెడ్ ప్రతినిధులకు చోటు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ పూర్తిస్థాయి పాలకమండలిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఫార్మసీ చట్టం-1948 లోని సెక్షన్ 19 ప్రకారం ఎన్నికైన ప్రతినిధులు, ప్రభుత్వం నామినేట్ చేసిన సభ్యులు, మెడికల్ కౌన్సిల్ ప్రతినిధితోపాటు ఎక్స్-అఫీషియో సభ్యులతో ఈ పాలక మండలిని ఖరారు చేస్తూ హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా నిర్వహించిన ఎన్నికల్లో గెలుపొందిన ఎం.వినోద్ కుమార్, సీహెచ్ పరమాత్మ, బీర్కూర్ సుధాకర్, టి.రాజు, ఎన్.ప్రమోద్, వి.నాగసాయి శ్రీకేష్‌లను క్లాజ్ (ఏ) కింద సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.
ఫార్మసీ చట్టంలోని క్లాజ్ (బీ) ద్వారా ఆర్గొండ శ్రీధర్, ఎదిరె రమేశ్, ప్రసన్నలక్ష్మి మచ్చ, శివకుమార్ తేజావత్, చిలువేరి మారుతిని కౌన్సిల్ సభ్యులుగా నామినేట్ చేశారు. వీరితోపాటు క్లాజ్ (సీ) ప్రకారం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సిఫారసు మేరకు డాక్టర్ గుండగాని శ్రీనివాస్‌ను వైద్య మండలి ప్రతినిధిగా, ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ విభాగాల నుంచి ఎక్స్-అఫీషియో సభ్యులుగా క్లాజ్ (డీ) కింద డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), క్లాజ్ (డీడీ) కింద డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ (డీసీఏ డీజీ), క్లాజ్ (ఈ) కింద డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ నుంచి సీనియర్ అనలిస్ట్‌లకు స్థానం కల్పించారు.
