తెలంగాణ ఆర్టీసీకి ఐదు నేషనల్ అవార్డులు

తెలంగాణ ఆర్టీసీకి ఐదు నేషనల్ అవార్డులు

నేషనల్‌ పబ్లిక్‌ బస్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం న్యూఢిల్లీలో అట్టహాసంగా జరిగింది. ఇందులో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. ఈ అవార్డులను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్‌టీయూ) ప్రతి ఏటా ఈ అవార్డులను ప్రధానం చేస్తుంది. 2022- -23 ఏడాదికి గాను రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం, తదితర కేటగిరిల్లో ఈ జాతీయ స్థాయి పురస్కారాలు టీఎస్‌ఆర్టీసీకి దక్కాయి. న్యూఢిల్లీలోని ఇండియా హబిటెట్‌ సెంటర్‌ లో శుక్రవారం సాయంత్రం జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ఏఎస్‌ఆర్‌టీయూ అధ్యక్షులు, కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల శాఖ కార్యదర్శి శ్రీ అనురాగ్‌ జైన్‌, ఐఏఎస్‌  ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

ప్రతిష్టాత్మకమైన 5 జాతీయ స్థాయి అవార్డులు టీఎస్ ఆర్టీసీకి దక్కడం సంస్థకు ఎంతో గర్వకారణమని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాలతో టీఎస్‌ఆర్టీసీ ఖ్యాతి మరింత పెరిగిందని అన్నారు. సిబ్బంది నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయడం వల్లే సంస్థకు ఈ పురస్కారాలు వచ్చాయని పేర్కొన్నారు. అవార్డులు వచ్చేలా కృషిచేసిన 43 వేల టీఎస్ఆర్టీసీ కుటుంబ సభ్యులకు ఈ పురస్కారాలను అంకితం చేస్తున్నట్లు సజ్జనర్‌ ప్రకటించారు.