డిసెంబర్ 8న కలెక్టరేట్లలో ‘తెలంగాణ తల్లి’ విగ్రహావిష్కరణ

డిసెంబర్ 8న  కలెక్టరేట్లలో ‘తెలంగాణ తల్లి’ విగ్రహావిష్కరణ
  •     ఉదయం 10 గంటలకు కార్యక్రమం చేపట్టాలని సీఎస్ ఆదేశాలు
  •     ఆరు జిల్లాలకు మినహాయింపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొనసాగుతున్న ‘ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల’ వేడుకల్లో భాగంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ‘తెలంగాణ తల్లి’ విగ్రహాలను  ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 9న  ఉదయం సరిగ్గా 10 గంటలకు అన్ని జిల్లా కలెక్టరేట్  కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సీఎస్  ఆ  ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

దీనికి సంబంధించి తక్షణమే అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, మెజిస్ట్రేట్‌‌లను ఆదేశించారు. కార్యక్రమం సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే, ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం నుంచి ఆరు జిల్లాలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. 

ములుగు, నారాయణపేట, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో ఈ కార్యక్రమం ఉండదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్  లేదా ఇతర కారణాల వల్ల ఈ మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన అన్ని జిల్లాల్లో విగ్రహావిష్కరణ పూర్తయిన వెంటనే.. కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను సీఎస్  ఆదేశించారు.