తెలంగాణలో కౌలు రైతుల పరిస్థితిపై హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో రైతు స్వరాజ్య వేదిక, తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ సంయుక్తంగా నిర్వహించిన విస్తృత సర్వే రిపోర్ట్‌ను విడుదల చేశాయి. రాష్ట్రంలోని కౌలు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, సవాళ్లను ఈ నివేదిక వెల్లడించింది
తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈ క్షేత్రస్థాయి పరిశీలన సాగింది. రాష్ట్రంలోని 22 జిల్లాలు, 47 మండలాలు, 57 గ్రామాల్లో ఈ విస్తృత సర్వే నిర్వహించారు. మొత్తం 1,816 మంది కౌలు రైతులను ప్రతినిధులు వ్యక్తిగతంగా కలిసి, వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులపై పూర్తి వివరాలను సేకరించారు.
ప్రధానంగా కౌలు రైతుల గుర్తింపు, వారికి ప్రభుత్వ పథకాల అమలు ఎలా జరుగుతోంది?, బ్యాంకుల నుంచి రుణ సౌకర్యాలు అందుతున్నాయా లేదా?, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే పరిహారం అందుతుందా? వంటి కీలక అంశాలపై ఈ కమిటీ లోతైన అధ్యయనం చేసింది.
►ALSO READ | స్టేట్ బ్యాంక్ కంటే ఎక్కువ వడ్డీ అందిస్తున్న పోస్టాఫీస్ స్కీమ్.. ఎంత లాభం వస్తుంది?
ఈ నివేదిక విడుదల కార్యక్రమానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, కాంగ్రెస్ నేత కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళితో పాటు పలువురు మేధావులు హాజరయ్యారు. కౌలు రైతుల సమస్యలు, వారికి ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాల్సిన ఆవశ్యకత, భవిష్యత్తులో ప్రభుత్వం అనుసరించాల్సిన విధానాలపై ఈ సందర్భంగా ప్రముఖులు సుదీర్ఘంగా చర్చించారు.
రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్నప్పటికీ ఎటువంటి గుర్తింపు, ప్రభుత్వ సాయం అందక కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని... ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కౌలు రైతు చట్టాన్ని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా వక్తలు డిమాండ్ చేశారు.
