- వినూత్న ఆవిష్కరణలతో పర్యాటకులను ఆకర్షించాలి: మంత్రి జూపల్లి
- వసతులు, హాస్పిటాలిటీలో రాజీ పడొద్దు
- పర్యాటక రంగంలో కొత్త ఒరవడిని తీసుకురావాలి
- ‘టూరిజం అండ్ ఇట్స్ విజన్’ వర్క్‌షాప్‌లో మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పర్యాటక రంగం దేశానికే దిక్సూచిగా మారాలని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పర్యాటకులను ఆకర్షించేలా వినూత్న మార్పులు తీసుకురావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. మంగళవారం తారామతి బరాదరిలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘టూరిజం అండ్ ఇట్స్ విజన్ 2026’ మేధోమథన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీజీటీడీసీ రూపొందించిన టేబుల్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సదస్సులో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, ఎండీ క్రాంతి వల్లూరు, నిథమ్ డైరెక్టర్ వెంకటరమణ, ఆర్కియాలజీ డైరెక్టర్ డాక్టర్ అర్జున్ రావు పర్యాటక అభివృద్ధిపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్‌గా మారిందని, మనకు ప్రకృతి ప్రసాదించిన వనరులు, వారసత్వ సంపదకు మెరుగులద్ది ప్రపంచానికి పరిచయం చేయాలన్నారు.
దేశ, విదేశీ పర్యాటకులు తెలంగాణ వైపు చూసేలా ప్రణాళికలు ఉండాలని దిశానిర్దేశం చేశారు. పర్యాటకులకు మన సంస్కృతి, సంప్రదాయాలతోపాటు గిరిజన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆచారాలను పరిచయం చేయాలన్నారు. ప్రకృతితో మమేకమై ఎక్కడో కొండకోనల్లో జీవిస్తున్న ఆదివాసీలు, గిరిజనులకు నగరంలోని చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, ఆకాశహర్మ్యాలు, మెట్రో రైళ్లు, నగరవాసుల ఆధునిక జీవన శైలిని తెలియజేసేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.
పర్యాటక ప్రదేశాలకు వచ్చి వాళ్లు అక్కడే కనీసం రెండు రోజులు బస చేసేలా ఆకర్షణీయమైన వాతావరణాన్ని సృష్టించాలన్నారు. వసతి, భోజనం, రవాణా వంటి మౌలిక సదుపాయాల్లో నాణ్యత పెరగాలన్నారు. ఐటీ కారిడార్లు, భారీ మాల్స్, విద్యాసంస్థల్లో మన పర్యాటక ప్రచార చిత్రాలు ఉండాలన్నారు. హాస్పిటాలిటీలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని, కేరళ వంటి రాష్ట్రాలతో మనం పోటీ పడాలన్నారు. భాషా సమస్యలు, నైపుణ్యం కలిగిన గైడ్ల కొరతను అధిగమించాలని సూచించారు.
