
- 5,587 కిలో మీటర్ల మేర నిర్మాణం: మంత్రి వెంకట్ రెడ్డి
- అసెంబ్లీ సెగ్మెంట్ల మధ్య కనెక్టివిటీ పెంచుతామని వెల్లడి
- హ్యామ్ రోడ్ల నిర్మాణంపై భట్టితో కలిసి రివ్యూ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశలో రూ.10,896 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్, జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి 4 లేన్ రోడ్లు వేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల మధ్య కనెక్టివిటీ కారిడార్లుగా హ్యామ్ రోడ్లు నిర్మిస్తామన్నారు. సెక్రటేరియెట్లో హ్యామ్ రోడ్ల నిర్మాణంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి వెంకట్ రెడ్డి సమీక్ష చేశారు. హ్యామ్ రోడ్ల ప్రపోజల్స్ కు సంబంధించిన వివరాలను స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు.
అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. ‘‘ఫస్ట్ ఫేజ్ లో 5,587 కిలో మీటర్ల రోడ్ల నిర్మాణానికి రూ.10,986 కోట్లు కేటాయించబోతున్నాం. వచ్చే నెల్లో టెండర్లు పిలుస్తాం. ఇందులో సింగిల్ లేన్, డబుల్ లేన్, 4 లేన్ మొత్తం 3,792 కిలో మీటర్ల రోడ్లను రూ.4,416 కోట్లతో వేస్తాం. 1,795 కిలో మీటర్ల రోడ్ల విస్తరణకు రూ.6,569 కోట్లు ఖర్చు చేస్తున్నం. వచ్చే మూడేండ్లలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ అద్దాల్లా మెరుస్తాయి. యాక్సిడెంట్స్ ఫ్రీ రోడ్ల నిర్మాణంపై దృష్టిపెట్టినం’’అని మంత్రి వెంకట్ రెడ్డి తెలిపారు. హ్యామ్ రోడ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం ఉండేలా చూడాలన్నారు. ట్రాఫిక్ సర్వేను పరిగణనలోకి తీసుకుని రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు.
వరదలతో పాడైన రోడ్ల వివరాలపై ఆరా
అంతకుముందు ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వెంకట్ రెడ్డి తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల వివరాలపై ఆరా తీశారు. పూర్తి వివరాలను సమర్పించాలని ఆఫీసర్లను ఆదేశించారు. రోడ్లు బాగుంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈ సమీక్షలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్ అండ్ బీ ఈఎన్సీలు మోహన్ నాయక్, జయ భారతి, సీఈలు బీవీ రావు, కిషన్ రావు, పలువురు ఎస్ఈలు, ఈఈలు పాల్గొన్నారు.