రూ.360 కోట్లతో రెవెన్యూ ఆఫీసులకు కొత్త భవనాలు : రెవెన్యూ మంత్రి పొంగులేటి

రూ.360 కోట్లతో రెవెన్యూ ఆఫీసులకు కొత్త భవనాలు : రెవెన్యూ మంత్రి పొంగులేటి

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో రెవెన్యూ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ తొలిదశలో అద్దె భవనాల్లో, శిథిలావస్థలో ఉన్న 107 తహసీల్దార్‌‌ కార్యాలయాలు, 10 ఆర్డీవో కార్యాలయాలను రూ.263 కోట్లతో నిర్మిస్తున్నామని చెప్పారు. 

స్టాంప్స్‌‌ అండ్‌‌ రిజిస్ట్రేషన్‌‌ శాఖలో రూ.97 కోట్లతో 48 సబ్‌‌ రిజిస్ట్రార్‌‌ కార్యాలయాలు, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌‌నగర్ జిల్లాల్లో జిల్లా రిజిస్ట్రార్‌‌ కార్యాలయాలు, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో డీఐజీ కార్యాలయాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ పనులకు మొత్తం రూ.360 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. కొత్త భవనాలను ఆధునిక సదుపాయాలతో నిర్మించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు.