
- వచ్చే మూడేండ్లలో రోడ్ల మరమ్మతులన్నీ పూర్తి చేస్తం: డిప్యూటీ సీఎం భట్టి
- గత ప్రభుత్వం బిల్లులన్నీ పెండింగ్ పెట్టింది
- వాటిని ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తున్నం
- కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ
- హ్యామ్ ప్రాజెక్టుపై బ్యాంకర్లు, కాంట్రాక్టర్లతో మీటింగ్.. హాజరైన మంత్రులు కోమటిరెడ్డి, సీతక్క
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం చేపడుతున్న హ్యామ్ ప్రాజెక్టు దేశానికి రోల్ మోడల్‌గా నిలవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. వచ్చే మూడేండ్లలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులన్నీ పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ మాదాపూర్‌లోని న్యాక్‌లో హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) ప్రాజెక్టుపై కాంట్రాక్టర్లు, బ్యాంకర్లు, ఆర్అండ్‌బీ, పంచాయతీ రాజ్ ఇంజనీర్లతో భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఇందులో ఆర్అండ్‌బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా హ్యామ్ ప్రాజెక్టుపై అధికారులు వివరించారు.
అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. ఏ రాష్ర్టంలో అయినా రోడ్లు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. ‘‘పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 17 ప్యాకేజీల ద్వారా 7,947 కిలోమీటర్ల మేర, ఆర్అండ్ బీ పరిధిలో 17 ప్యాకేజీల ద్వారా 5,190 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. కేబినెట్ ఆమోదించిన పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలి” అని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లకు ఆర్థికంగా ప్రోత్సాహం కల్పించేందుకు బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. ‘‘కాంట్రాక్టర్ల సమస్యలపై మాకు అవగాహన ఉంది.
గత ప్రభుత్వ పెద్దలు రూ.1.75 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ఒప్పందాలు చేసుకొని.. రూ. 45 వేల కోట్ల విలువైన పనులకు టోకెన్లు జారీ చేసి, ఆ బకాయిలు చెల్లించకుండా వెళ్లారు. పెండింగ్ బిల్లులను ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తున్నం. హ్యామ్ రోడ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటాకు కావాల్సిన 40 శాతం నిధుల సమీకరణ కోసం ప్రయత్నం చేస్తున్నం. భవిష్యత్తులో కాంట్రాక్టర్లకు ఇబ్బందులు ఉండవు. చిన్న కాంట్రాక్టర్లకు నష్టం జరగనియ్యం” అని భరోసా ఇచ్చారు. ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని ఫోర్ లేన్లుగా విస్తరించాల్సిన రోడ్ల జాబితాను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
6 వేల కోట్ల పనులకు టెండర్లు..
తమ ప్రభుత్వం వచ్చాక 20 నెలల్లో రూ.6 వేల కోట్ల రోడ్ల పనులకు టెండర్లు పిలిచామని, ఇందులో రూ.2,500 కోట్ల పనులు మొదలయ్యాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. హ్యామ్‌తో వచ్చే మూడేండ్లలో రోడ్ల మరమ్మతులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని, బ్యాంకర్లు సహకారం అందించాలని కోరారు. ‘‘కేంద్రమంత్రి గడ్కరీ రాష్ట్ర ప్రాజెక్టులకు సహకరిస్తున్నారు. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ మంజూరు చేశారు. కల్వకుర్తి నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ ఫ్లైఓవర్ మంజూరు చేశారు. త్వరలోనే హైదరాబాద్–విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది” అని తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులపై ఈ నెల చివర్లో తాను, సీఎం, డిప్యూటీ సీఎం కలిసి ప్రధానిని కలుస్తామన్నారు. ట్రిపుల్ ఆర్ నార్త్‌కు త్వరలోనే కేంద్రం ఆమోదం తెలుపుతుందన్నారు.
‘హ్యామ్’ను విజయవంతం చేద్దాం: సీతక్క
హ్యామ్ ప్రాజెక్టుపై 8 నెలల నుంచి కసరత్తు జరుగుతున్నదని మంత్రి సీతక్క తెలిపారు. దీన్ని విజయవంతం చేద్దామని కాంట్రాక్టర్లకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ మొదలు మారుమూల పల్లె వరకు రోడ్లు బాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత పదేండ్లుగా రోడ్ల మరమ్మతులు చేయకపోవటంతో దారుణంగా ఉన్నాయన్నారు. కాగా, చిన్న కాంట్రాక్టర్లను ఆదుకోవాలని బిల్డర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డీవీఎన్ రెడ్డి మంత్రులను కోరారు.