ఆర్టీసీని విస్తరించే దిశగా చర్యలు...ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి పొన్నం సమీక్ష

ఆర్టీసీని విస్తరించే దిశగా చర్యలు...ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి పొన్నం సమీక్ష

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ఆర్టీసీ సేవలను మరింత విస్తరిస్తామని, ప్రయాణికుల సౌకర్యార్థం చర్యలను వేగవంతం చేసినట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో నల్గొండ, రంగారెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లాలతో పాటు హైదరాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

రాష్ట్రంలో ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని మంత్రి పేర్కొన్నారు. బస్సుల్లో రద్దీ విపరీతంగా ఉన్నందున, మహిళలకు ఇబ్బంది కలగకుండా అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. గ్రామ స్థాయిలో ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచడం, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కొత్త రూట్‌లలో బస్సులను ప్రవేశపెట్టడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను మంత్రులు, ఎమ్మెల్యేలు వినతుల రూపంలో మంత్రికి అందజేశారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులను మంత్రి ఆదేశించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఆ దిశగా తగిన చర్యలు తీసుకుంటున్నామని పొన్నం వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,   ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

ఆర్టీసీ చర్చల వాయిదాపై జేఏసీ ఆగ్రహం

ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన సమ్మె నోటీసుపై జరగాల్సిన చర్చలు వాయిదా పడటం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం లేబర్ కమిషనర్ కార్యాలయంలో యాజమాన్యం, కార్మిక సంఘాల ప్రతినిధుల మధ్య జరగాల్సిన ఈ భేటీ.. అసెంబ్లీ సమావేశాల కారణంగా తాత్కాలికంగా వాయిదా పడింది. తదుపరి తేదీని వెల్లడించకపోవడంపై జేఏసీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. చర్చల తేదీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ కన్వీనర్ ఈదురు వెంకన్న ఆధ్వర్యంలో నేతలు కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సునీతా దాస్ గుప్తాను కలిసి వినతి పత్రం అందజేశారు. 

చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తే సహించేది లేదని ఈదురు వెంకన్న స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో వచ్చే నెల మొదటి వారంలో సమ్మె తేదీని ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోలను సందర్శించి, కార్మికులను సమ్మెకు సమాయత్తం చేస్తామని నేతలు వెల్లడించారు.