భవిష్యత్తు గ్రీన్ పవర్​దే : డిప్యూటీ సీఎం భట్టి

భవిష్యత్తు గ్రీన్ పవర్​దే  : డిప్యూటీ సీఎం భట్టి
  • 2030 నాటికి 20 వేల మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి
  • డిమాండ్ మేరకు ఉత్పత్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడి 
  • ఏపీలోని గ్రీన్‌‌కో ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్టు సందర్శన

హైదరాబాద్, వెలుగు: భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా గ్రీన్ పవర్ ఆధారితం కానుందని, ఈ దిశగా తెలంగాణ రాష్ట్రం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పిన్నాపురంలోని గ్రీన్‌‌‌‌కో ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్టును శనివారం భట్టి సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, గ్రీన్ పవర్ ఉత్పత్తి కోసం రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల విలువైన ఎంఓయూలు కుదిరాయని వెల్లడించారు. 

రాష్ట్రం 2029 –-30 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంతో ముందుకు పోతోందని డిప్యూటీ సీఎం తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో సోలార్, విండ్, థర్మల్, పంప్డ్ స్టోరేజ్, ఫ్లోటింగ్ సోలార్, హైడ్రోజన్ పవర్ వంటి విభిన్న మార్గాల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తితో ఖర్చు, కాలుష్యం పెరిగి వాతావరణ సమతుల్యత దెబ్బతింటుందని, అందుకే ప్రపంచం మొత్తం గ్రీన్ పవర్ వైపు పరుగులు తీస్తోందని ఆయన వివరించారు.

ఏరియల్ సర్వే, సైట్ పరిశీలన

గ్రీన్‌‌కో ప్రాజెక్టు సందర్శనలో భాగంగా డిప్యూటీ సీఎం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. క్లోజ్డ్-లూప్ పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్‌‌కు సంబంధించిన ఎగువ, కింది రిజర్వాయర్లు, పవర్‌‌హౌస్ కాంప్లెక్స్ వంటి కీలక సౌలభ్యాలను పరిశీలించారు. గ్రీన్‌‌కో ఇంజినీర్లు, నిర్వహణ బృందంతో మాట్లాడి, సోలార్, విండ్, హైడ్రో పవర్ నిల్వ వ్యవస్థల సమన్వయాన్ని అధికార బృందంతో కలిసి పర్యవేక్షించారు. డిప్యూటీ సీఎం వెంట ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్‌‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్‌‌కో సీఎండీ హరీశ్, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి పాల్గొన్నారు.

గ్రీన్‌‌కో ప్రాజెక్టు ప్రపంచంలోనే మొదటిది

గ్రీన్‌‌కో ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్టు 4 వేల ఎకరాల విస్తీర్ణంలో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ద్వారా 6,680 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తోందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఇందులో సోలార్ ద్వారా 4 వేల మెగావాట్లు, విండ్ పవర్ ద్వారా వెయ్యి మెగావాట్లు, పంప్డ్ స్టోరేజ్ ద్వారా 1,680 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు. ఒకే చోట ఇంత పెద్ద ఎత్తున గ్రీన్ పవర్ ఉత్పత్తి ప్రపంచంలోనే మొదటిసారని, ఇది అభినందనీయమని ఆయన కొనియాడారు.