ట్యాంక్​బండ్​పై మాజీ స్పీకర్ శ్రీపాదరావు విగ్రహం

ట్యాంక్​బండ్​పై  మాజీ స్పీకర్ శ్రీపాదరావు విగ్రహం
  • రాంజీ గోండు, చాకలి ఐలమ్మ , సర్వాయి పాపన్న, జైపాల్ రెడ్డి విగ్రహాలూ పెడ్తం: రేవంత్​ రెడ్డి
  • రాంజీ గోండు, చాకలి ఐలమ్మ , సర్వాయి పాపన్న, 
  • జైపాల్ రెడ్డి వంటి ప్రముఖుల విగ్రహాలు కూడా..
  • ఇందుకోసం కేబినెట్​ సబ్​ కమిటీ ఏర్పాటు చేస్తం
  • మాజీ స్పీకర్​ శ్రీపాదరావు జయంతి ఉత్సవాల్లో సీఎం రేవంత్​ ప్రకటన

బషీర్ బాగ్, వెలుగు:  అసెంబ్లీ స్పీకర్​గా, ప్రజాప్రతినిధిగా శ్రీపాదరావు అందించిన సేవలు ఎన్నిటికీ మరిచిపోలేనివని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి చెందిన ప్రముఖుల విగ్రహాలు హైదరాబాద్​లోని ట్యాంక్ బండ్ పై ఉండాలని, మహనీయుల చరిత్ర భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని చెప్పారు. మాజీ స్పీకర్​ శ్రీపాదరావు విగ్రహంతో పాటు రాంజీ గోండు, చాకలి ఐలమ్మ , సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, జైపాల్ రెడ్డి  వంటి ప్రముఖుల విగ్రహాలను ట్యాంక్ బండ్​పై ఏర్పాటు చేస్తామని తెలిపారు. పర్యాటక శాఖ మంత్రితో కేబ్​నెట్​ సబ్​ కమిటీ ఏర్పాటు చేసి, ట్యాంక్ బండ్​పై విగ్రహాల కోసం విధానపరమైన ప్రకటన చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఉమ్మడి ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ ​దుద్దిళ్ల శ్రీపాద రావు 87వ జయంతి ఉత్సవాలను శనివారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. 

హైదరాబాద్​లోని రవీంద్రభారతిలో జరిగిన ఈ వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ దీపాదాస్ మున్షీ, ప్రభుత్వ విప్​ బీర్ల ఐలయ్య,  ఎమ్యెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ స్పీకర్​గా ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేసిన మహనీయుడు శ్రీపాదరావు అని కొనియాడారు. ‘‘శ్రీపాదరావును స్పీకర్ గా ఎన్నుకునే సమయంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఎన్టీఆర్​ మొదటి ఆమోదంగా సంతకం చేసి ఎన్నుకున్నారు. స్పీకర్ గా ఉన్న సమయంలో ప్రజల సమస్యలను ప్రతిపక్షాలు లేవనెత్తేందుకు అవకాశం ఇవ్వడంతో పాటు, వాటిని నెరవేర్చేందుకు పాలక పక్షంతో చర్చలు జరిపిన గొప్ప వ్యక్తి శ్రీపాదరావు” అని అన్నారు. 

మంథనికి ఎంతో ప్రత్యేకత

శ్రీపాదరావు ప్రాతినిధ్యం వహించిన మంథని ప్రాంతానికి దేశంలోనే ప్రత్యేకత ఉందని, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మంథని నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారన్నారు. పీవీ శిష్యుడిగా శ్రీపాదరావు మూడుసార్లు అక్కడి నుంచే ఎమ్మెల్యేగా పనిచేశారని తెలిపారు. మర్రి చెన్నారెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్, గడ్డం వెంకటస్వామితో కలిసి శ్రీపాదరావు పని చేశారని గుర్తుచేశారు. ‘‘శ్రీపాదరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. ఆయన స్ఫూరితో పని చేస్తూ , తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. మొదటిసారి సీఎం అయిన నాకు పాలనలో తక్కువ అనుభవం ఉంది. శ్రీధర్ బాబు సూచనలు తీసుకుంటూ రాష్ట్రాన్ని సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తున్నాం. రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలో శ్రీధర్​బాబు నైపుణ్యం ఎంతో ఉంది. 80 రోజుల ప్రభుత్వ పనితీరులో శ్రీధర్ బాబు పాత్ర ముఖ్యమైనది” అని ఆయన పేర్కొన్నారు. 

శ్రీపాదరావు స్పీకర్ గా ఉన్నప్పుడు నిర్మాణాత్మక, ప్రజాస్వామ్య బద్దంగా అసెంబ్లీ లో చర్చలు జరిగాయని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. శ్రీపాదరావు జయంతి ఉత్సవాలను ప్రభుత్వం తరఫున జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. శ్రీపాదరావు జీవితం, ఆయన చేసిన సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకం అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రజల కోసం  సేవ చేస్తున్న సమయంలో తన తండ్రి శ్రీపాదరావు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు తాను రాజకీయాలలోకి వచ్చానని తెలిపారు. 

మంత్రి పొన్నం ప్రభాకర్  మాట్లాడుతూ.. శ్రీపాద రావు ఆశీష్షులతో తాను విద్యార్థి నాయకుడి నుంచి ఈ స్థాయికి వచ్చానని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఎలా ఉండాలని శ్రీపాద రావు కోరుకున్నారో ఇప్పుడు ఆయన కొడుకు శ్రీధర్ బాబు నెరవేరుస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పరిపాలన లో భాగంగా శ్రీధర్ బాబు పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పారు. స్పీకర్ గా అసెంబ్లీని శ్రీపాదరావు నడిపించిన తీరు ఎప్పటికీ అందరికీ మార్గదర్శకంగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. శ్రీపాదరావుతోపాటు , ఆయన తనయుడు శ్రీధర్ బాబుతో తాను చట్టసభల్లో పాల్గొన్నానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి గా కావాల్సిన వ్యక్తి శ్రీపాదరావు అని తెలిపారు.