ఇక ఆన్సర్ షీట్లూ.. ‘ఏఐ’ దిద్దేస్తది!..వచ్చే ఏడాది నుంచి పైలట్ ప్రాజెక్టుగా పాలిటెక్నిక్‌‌‌‌లో అమలుకు నిర్ణయం

ఇక ఆన్సర్ షీట్లూ.. ‘ఏఐ’ దిద్దేస్తది!..వచ్చే ఏడాది నుంచి పైలట్ ప్రాజెక్టుగా పాలిటెక్నిక్‌‌‌‌లో అమలుకు నిర్ణయం
  • ముందుగా రెండు సబ్జెక్టులతో ప్రయోగం 
  • ఏఐ దిద్దినంక.. మళ్లీ మాన్యువల్‌‌‌‌గా చెకింగ్ 

హైదరాబాద్, వెలుగు: టెక్నికల్ ఎడ్యుకేషన్‌‌‌‌లో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది. విద్యార్థులు రాసిన ఆన్సర్ షీట్లను లెక్చరర్లతోనే కాకుండా.. ఏఐ ద్వారా దిద్దించాలని డిసైడ్ అయింది. టెక్నాలజీని వాడుకుంటూ ఎగ్జామ్స్ వాల్యుయేషన్ ప్రక్రియను స్పీడప్ చేసేందుకు ప్లాన్ రెడీ చేసింది. తొలుత పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని సబ్జెక్టుల్లో అమలు చేసి.. దశల వారీగా అన్ని సబ్జెక్టులకు అమలు చేయాలని టెక్నికల్ ఎడ్యుకేషన్ భావిస్తోంది. 

రాష్ట్రంలో మొత్తం 115 పాలిటెక్నిక్ కాలేజీలు ఉండగా.. వీటిలో దాదాపు 67 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికే పాలిటెక్నిక్ పరీక్షల్లో పలు సబ్జెక్టుల్లో ఓపెన్ బుక్ సిస్టమ్ అమలు చేస్తుండగా, తాజాగా ఏఐతో ఆన్సర్ షీట్లను వాల్యుయేషన్ చేయించాలని నిర్ణయించారు. రెండేండ్ల కిందే దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాగా.. ప్రస్తుతం తుది దశకు చేరినట్టు తెలుస్తోంది. ఒకేసారి అన్ని సబ్జెక్టులకు కాకుండా తొలుత రెండు సబ్జెక్టుల్లో అమలు చేయాలని స్టేట్ బోర్డు ఆఫ్‌‌‌‌ టెక్నికల్ ఎడ్యుకేషన్‌‌‌‌ అండ్‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌ (ఎస్బీటెట్) అధికారులు నిర్ణయించారు. వచ్చే అకాడమిక్ ఇయర్‌‌‌‌‌‌‌‌లో ప్రయోగాత్మకంగా ఏఐ వాల్యుయేషన్‌‌‌‌ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. 

డబుల్ వాల్యువేషన్ కూడా ఉంటది.. 

ప్రస్తుతం ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ ప్రక్రియ లెక్చరర్లతో కొనసాగుతోంది. కొన్నిసార్లు అనుకున్న టైమ్‌‌‌‌కి ఆన్సర్ షీట్లను దిద్దడం ఇబ్బందికరంగా మారుతోంది. ఈ క్రమంలోనే అధికారులు ఆన్‌‌‌‌లైన్ వాల్యుయేషన్ ఆలోచన చేశారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఏఐ ద్వారా చేపట్టే వాల్యుయేషన్‌‌‌‌ ప్రక్రియను.. మళ్లీ మాన్యువల్‌‌‌‌ గాను లెక్చరర్లతో దిద్దించనున్నారు. 

చేతి రాతల సవాల్..

మరోవైపు, విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. దీంతో కొన్ని చేతి రాతలను ఏఐ గుర్తుపట్టడంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎలాంటి తప్పులు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.