- మాజీ ఎమ్మెల్యే దాస్యం సవాల్ కు .. ఎమ్మెల్యే నాయిని -ప్రతి సవాల్
- నిమిషాల్లోనే బైక్ పై ఒక్కడే అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి
- సవాల్ విసిరి ఎక్కడకుపోయావని దాస్యంపై ఫైర్
వరంగల్, వెలుగు : బీఆర్‍ఎస్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే మధ్య గురువారం సవాల్, ప్రతి సవాల్ నడిచాయి. తాను చెప్పిన ప్లేస్‍కు రావాలని ఒకరు సవాల్ చేస్తే.. మరొకరు బైక్ పై నిమిషాల్లో అక్కడకు వెళ్లి.. నువ్వెక్కడ అని ఫైర్ అయ్యారు. ఇష్యూ అంతా ప్రాక్టికల్ కావడంతో వరంగల్ సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే..
వరంగల్ వెస్ట్ బీఆర్‍ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గురువారం పార్టీ నేతలు ఆర్‍ఎస్.ప్రవీణ్ కుమార్, తాటికొండ రాజయ్యతో కలిసి హనుమకొండలోని పార్టీ ఆఫీసులో ప్రెస్‍మీట్ నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. “ చిరు వ్యాపారులను ఇబ్బంది పెడ్తున్నాడు. రాజేందర్‍రెడ్డి దమ్ముంటే గన్‍మెన్లు లేకుండా ఐదు నిమిషాల్లో హనుమకొండ బస్టాండ్ వద్దకు రావాలి’ అని సవాల్ చేశారు. దీంతో ఎమ్మెల్యే రాజేందర్‍రెడ్డి వెంటనే స్పందించారు. ఇంటి నుంచి బైక్ పై హనుమకొండ బస్టాండ్ వద్దకు వచ్చారు.
చిరువ్యాపారులు, ప్రయాణికులతో మాట్లాడుతూ.. గంటన్నరదాకా ఎదురుచూశారు. అనంతరం ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ..‘ వినయ్ భాస్కర్.. నీ సవాల్ చాలెంజ్ తీసుకున్నా. గన్‍మెన్లు లేకుండా ఒక్కడినే వచ్చా. ఇక్కడకొచ్చి రెండు గంటలైంది. ఏడబోయినవ్. నీ దమ్మేది. ఎమ్మెల్యేగా పదేండ్లు. అంతకుముందు మరో 4 ఏండ్లు ఎమ్మెల్యేగా అభివృద్ధిని వదిలి కబ్జాలు చేశావ్. అందుకే జనాలు ఇంటికి పంపారు.
15 ఏండ్లలో నువ్వు చేయలేని అభివృద్ధిని నేను చేస్తుంటే.. ఎందుకు అడ్డుపడుతున్నవ్. నోరు మూసుకో’’.. అంటూ ఫైర్ అయ్యారు. అయితే.. ఇలా వీరి మధ్య సవాల్, ప్రతి సవాల్ కు హనుమకొండ బస్టాండ్ ఏరియాలో తీవ్ర ట్రాఫిక్ జామ్ అయింది. .
అయితే.. ప్రజలు నడవలేని పరిస్థితులు ఉండడంతో బస్టాండ్ జంక్షన్ లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. రోడ్లపై వెహికల్స్ పార్కింగ్ చేయకుండా కట్టడి చేశారు. తద్వారా బస్టాండ్ ఏరియాలో ట్రాఫిక్ సమస్య లేకుండా చొరవ చూపారు.
