అంబర్ పేట, వెలుగు: ప్రముఖ విద్యావేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత చుక్కా రామయ్య వదేండ్ల పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం హైదరాబాద్ విద్యానగర్‌లోని ఆయన నివాసంలో జరిగిన బర్త్‌డే వేడుకలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, ప్రముఖ హక్కుల న్యాయవాది మాడభూషి శ్రీధర్, సీనియర్ జర్నలిస్టులు రామచంద్రమూర్తి, మల్లేపల్లి లక్ష్మయ్య, డాక్టర్ ఎన్.గౌతమ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమృత తదితరులు ఆయనను కలిసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ... చుక్కా రామయ్యకు వందేండ్లు నిండినా ఆయన జ్ఞాపక శక్తి అద్భుతమని కొనియాడారు. ఆయన స్ఫూర్తిని, మార్గదర్శకత్వాన్ని ఆచరణలో పెడితే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు. రామయ్య జన్మదిన వేడుకలను సీఎం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర స్థాయిలో అభినందన కార్యక్రమం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అంతకుముందు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, కాలేరు వెంకటేష్ తదితరులు చుక్కా రామయ్య ఇంటికెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సత్కరించారు.
చుక్కా రామయ్యకు సీఎం రేవంత్ విషెస్
మేధావి చుక్కా రామయ్యకు సీఎం రేవంత్ రెడ్డి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో బర్త్‌డే విషెస్ చెప్పారు. అద్భుత విద్యా బోధనతో యువత భవితకు బంగారు బాటలు వేసి వ్యక్తి రామయ్య అని కొనియాడారు.
