బ్రెజిల్ దేశంలో ప్రపంచ వాతావరణ సదస్సు 30వ సమావేశం నవంబర్ 10 నుంచి 21 వరకు జరుగుతోంది. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 194 దేశాల నుంచి 57 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. 1995లో మొట్టమొదటి సమావేశం జరగగా ఈ సంవత్సరం 30వ సదస్సు జరుగుతున్నది. భూమి ఉష్ణోగ్రత పెరగడానికి పుడమి వాతావరణంలో పెరుగుతున్న కర్బన ఉద్గారాలు కారణం అని గుర్తించారు.
ఈ ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల ప్రపంచ వాతావరణంలో విపరీత మార్పులు ఏర్పడుతున్నాయి. ఇది శాస్త్రీయంగా రుజువు అయిన నేపథ్యంలో కాలుష్యాన్ని తగ్గించడానికి అందరు కలిసి నిర్దిష్ట చర్యలు చేపట్టడానికి ఈ సదస్సులలో చర్చలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల మానవాళి మనుగడకే ప్రమాదం ఏర్పడిన నేపథ్యంలో సుదీర్ఘమైన చర్చలు జరగడం బహుశా ఈ ఒక్క అంశం మీదనే కావచ్చు.
ఈ సదస్సుకు ముఖ్యంగా అమెరికా హాజరుకాలేదు. సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ వాతావరణ మార్పును ‘ప్రపంచంపై ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద కుట్ర’గా అభివర్ణించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తమ దేశ ప్రతినిధి బృందాన్ని పంపలేదు. 1995లో కాప్ ప్రారంభమైన తర్వాత అమెరికా అధికారికంగా ప్రాతినిధ్యం వహించకపోవడం ఇదే మొదటిసారి. ప్రతినిధి బృందాన్ని నమోదు చేసుకోని ఇతర దేశాలు ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, శాన్ మారినో మాత్రమే.
చైనా, భారత్ దేశాల నుంచి ప్రతినిధి బృందాలు ఉన్నా ఉన్నతస్థాయి నాయకులు రాలేదు. చైనా అగ్ర నాయకుడు, అధ్యక్షుడు జిన్‌పింగ్, కాప్30తో సహా ఇటీవల జరిగిన 10 యూఎన్ వాతావరణ మార్పు సమావేశాలలో కనీసం 7 సమావేశాలకు హాజరుకాలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కనీసం 3 ప్రధాన కాప్ శిఖరాగ్ర సమావేశాలకు స్వయంగా హాజరయ్యారు - కాప్ 21 (పారిస్, 2015), కాప్ 26 (గ్లాస్గో, 2021), కాప్28 (దుబాయ్, 2023). కాప్27, కాప్30తో సహా ఇతర 5 సమావేశాలకు ఆయన హాజరుకాలేదు.
కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్
30 ఏండ్ల ప్రస్థానంలో ప్రపంచ వాతావరణ సదస్సుకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఈ సదస్సు ఒక ప్రత్యేక పదం ‘కాప్’ను అంతర్జాతీయ తెర మీదకు తెచ్చింది. ‘కాప్’ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సభ్యత్వం ఉన్న అన్ని దేశాలను పార్టీలుగా భావించి చిన్న, పెద్ద, ధనిక, పేద దేశాలన్నీ కూడా సమాన సభ్యులుగా, ఏకాభిప్రాయం సాధనే మార్గంగా, ఒప్పందంగా పరిగణించడం కూడా ఒక ప్రత్యేక లక్షణం. ఇదే ఈ సదస్సు బలం.
ఇదే దాని బలహీనత. ఇన్ని ఏండ్లు అయ్యింది ఏమి సాధించిండ్రు అనే ప్రశ్న ఎప్పుడూ ఎదురవుతుంటుంది. సాధారణంగా అంతర్జాతీయ చర్చలు ఒక సమస్య మీద మొదలై ఒక ఒప్పందంగా మారుతాయి. ఒకప్పుడు అంతర్జాతీయ వాణిజ్యం మీద మూడు దశాబ్దాల చర్చల అనంతరం 1995లో ఒక ఒప్పందం కుదిరింది. అందులో భాగంగానే ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటైంది.
జీవవైవిధ్య సంరక్షణకు ఒక వేదిక
1992 రియో ఎర్త్ సమ్మిట్ వలన పర్యావరణానికి సంబంధించి మూడు ప్రధాన ఫలితాలు వెలువడినాయి. అజెండా 21, యూఎన్ఎఫ్సీసీసీ ఏర్పాటు, జీవ వైవిధ్య సంరక్షణకు ఒక వేదిక. ఇవి ప్రాపంచిక పర్యావరణ పాలన దిశగా సుస్థిరమైన అభివృద్ధికి బాటలు వేయడానికి నిర్ణయించిన తొలి పునాదులు. ఒకే పర్యావరణ సమావేశం నుంచి వెలువడిన ఈ మూడు మార్గాలలో మొదటిది అడుగుకు పోయింది, మిగతా రెండు తేలియాడుతున్నాయి. ఒడ్డుకు చేరలేదు. దీనికి ఒక మూల కారణం ఉన్నది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ దిశ, లక్షణాలు మార్చే ఏ ప్రక్రియ అయినా వెనుకబడుతున్నది.
పర్యావరణ వనరుల విధ్వంసం మీద నిర్మాణమైన ఆర్థిక, సామాజిక వ్యవస్థలో మార్పు రాకుండా సంపన్న వర్గాలు మొదటినుంచి అడ్డుపడుతూనే ఉన్నాయి. ఎజెండా 21 అంటేనే ఆ మూలాలను మార్చడం. అందుకే సమానత్వం, పేదరిక నిర్మూలన, అధికార వికేంద్రీకరణ, సాధికారత అంశాలు ఇమిడి ఉన్న ఎజెండా 21 ముందుకు సాగలేదు. వాతావరణ మార్పులు, జీవ వైవిధ్యం మీద జరుగుతున్న సమావేశాల పురోగతి కూడా విజ్ఞానం, శాస్త్రం, శాస్త్రీయ పరిశోధనల వరకే. తదుపరి నిర్దిష్ట చర్యల విషయంలో ముందుకుసాగడంలేదు.
చర్చలను పక్కదారి పట్టిస్తున్న లాభాపేక్ష శక్తులు
లాభాపేక్ష శక్తులు వాతావరణ సదస్సు చర్చలను పక్కదారి పట్టిస్తున్నాయి. 25 ఏండ్ల వరకు ప్రతి ఏటా సదస్సులు జరుగుతున్నా పెద్దగా పట్టించుకోని చమురుసంస్థలు... శిలాజ ఇంధనాల ఉపయోగం క్రమేపీ తగ్గించాలనే డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా ఊపు అందుకుని 26వ సదస్సులో జోరు పెరిగిన దరిమిలా ఈ సదస్సులలో కూడా జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. శిలాజ ఇంధన లాబీయిస్టులు 2000ల ప్రారంభం నుంచి యూఎన్ వాతావరణ మార్పు సమావేశాలకు హాజరవుతున్నారు, అయితే 2021లో కాప్26 నుంచి వారి ఉనికి చాలా ప్రముఖంగా, వివాదాస్పదంగా మారింది.
ఆ సదస్సులో 500 మందికి పైగా శిలాజ ఇంధన లాబీయిస్టులు నమోదు చేసుకున్నారని గుర్తించారు. ఈజిప్టులో జరిగిన కాప్27 (2022)కి 630 మందికి పైగా లాబీయిస్టులు హాజరయ్యారు. బ్రెజిల్‌లోని బెలెమ్‌లో ప్రస్తుతం జరుగుతున్న కాప్30లో శిలాజ ఇంధన లాబీయిస్టులు రికార్డు స్థాయిలో 1,602 మంది హాజరైనారు. అయితే వీరు కార్పొరేటు ప్రయోజనాలు కాపాడడానికే ఈ సదస్సులలో పాల్గొంటున్నారు అని అర్థం అవుతున్నది. ఈ సంవత్సరం చైనా, భారత, అమెరికా దేశాధినేతలతో సహా ఇతర అధినాయకులు రాకపోవడానికి కారణం ఇందుకే కావచ్చు అనే అనుమానం కూడా కొందరికి కలుగుతున్నది.
అస్థిరంగా మనదేశ ప్రతినిధివర్గం
కాప్ 28 సదస్సు దుబాయిలో జరగడంతో 700కు పైగా హాజరయ్యారు. ప్రతిసారి కొత్త ముఖాలే. ఎక్కువ శాతం సహాయకులు, కన్సల్టెంట్లు. వాతావరణ మార్పు మీద, పర్యావరణ అనుకూల విధానాల మీద భారత్ నాయకత్వం ఉండాలని కోరుకుంటుంటే, మన దేశ ప్రతినిధివర్గం మాత్రం అస్థిరంగా పాల్గొంటున్నది. ముందస్తు సంప్రదింపులు లేవు. దాదాపు 100కు పైగా అంశాల మీద చర్చలు జరుగుతుంటే మన ప్రతినిధులు ఎక్కడా కనపడకపోవడం యాదృచ్ఛికం కాదు. వర్గ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ సామ్రాజ్యవాద ధోరణులకు నీరాజనం పలుకుతూ పాలకులు దేశ గౌరవాన్ని తగ్గిస్తున్నారు.
ప్రకృతి వనరుల విధ్వంసం
ప్రకృతి వనరుల విధ్వంసానికి ప్రధాన కారణమవుతున్న ఆధునికతను అంది పుచ్చుకోవటంలో ఇప్పటికీ మనం చూపెడుతున్న ఉత్సాహానికి మరో పేరు అపరిమిత అభివృద్ధి. పారిస్ ఒప్పందంలో భాగంగా సమర్పించాల్సిన జాతీయ లక్ష్యాలు ప్రతి దేశం మూడోసారి ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 121 దేశాలు ఇచ్చాయి. భారత దేశం ఇంకా ఇవ్వలేదు. ఈ లక్ష్యాలు దేశీయంగా ఎవరు, ఎక్కడ తయారు చేస్తున్నారు వంటి విషయాలు బహిరంగంగా లేవు.
పార్లమెంటులో గాని ఇంకా ఇతరత్రా ఎక్కడా కూడా భారతదేశం ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి అని వివరించే సమాచారం లేదు. మన జాతీయ లక్ష్యాల కూర్పులో, ప్రకటనలో ఇంత గోప్యత పాటించాల్సిన అవసరం ఏమి వచ్చింది? ప్రపంచ వాతావరణ సదస్సులలో భారత ప్రాతినిధ్యం కూడా అసంబద్ధంగా ఉంటున్నది. సదస్సు చర్చలలో పాల్గొనడం ఒక ప్రహసనంగా మారింది.
- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్
