- డిసెంబర్ నాటికి 40 మంది చిన్నారులకు ఆపరేషన్లు పూర్తి చేస్తామన్న డాక్టర్లు
పద్మారావునగర్, వెలుగు: పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న చిన్నారులకు గాంధీ ఆస్పత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈఎన్‌టీ విభాగం ఆధ్వర్యంలో ఐదేండ్లలోపు పిల్లలకు ఈ సేవలను అందిస్తున్నారు. గురువారం ఈఎన్‌టీ వైద్య విభాగంలో ఓ బాలుడికి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని విజయవంతంగా చేశారు. ఈ సందర్భంగా ఈఎన్‌టీ హెచ్‌ఓడీ డాక్టర్ భూపేందర్ రాథోడ్ మాట్లాడారు. ప్రస్తుతం 40 మంది చిన్నారులకు ఈ ఆపరేషన్ అవసరం ఉందని, డిసెంబర్‌కల్లా అందరి ఆపరేషన్లు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్‌తో చిన్నారులు వినడంతో పాటు మాట్లాడగలుగుతారని డాక్టర్లు వెల్లడించారు. పేదలకు గాంధీలో ఈ అవకాశం లభించడం ఒక వరమని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌కు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని, అయితే, ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చేస్తున్నామని చెప్పారు. తమ దవాఖానలో కార్పొరేట్ స్థాయి ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్లు గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలిపారు. సీఎం రేవంత్, మంత్రి దామోదర చొరవతో రాష్ట్రంలో వైద్య రంగం అభివృద్ధి చెందుతోందని చెప్పారు.
