పోషకాహార లోపాల ప్రపంచం.. ప్రతి 11 మందిలో ఒకరు ఆకలి వలయంలో ఉక్కిరి బిక్కిరి

పోషకాహార లోపాల ప్రపంచం.. ప్రతి 11 మందిలో ఒకరు ఆకలి వలయంలో ఉక్కిరి బిక్కిరి

ప్రపంచవ్యాప్తంగా 731 నుంచి 757 మిలియన్ల వరకు ప్రపంచ మానవాళి ఆకలి కేకలు పెడుతున్నారని, ప్రతి 11 మందిలో ఒక్కరు ఆకలి వలయంలో ఉక్కిరి బిక్కిరి అవుతూ బక్కచిక్కుతున్నారని ఐక్యరాజ్యసమితి  ఫుడ్‌‌‌‌ అండ్‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌ ఆర్గనైజేషన్‌‌‌‌ విడుదల చేసిన  ‘స్టేట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఫుడ్‌‌‌‌ సెక్యూరిటీ అండ్‌‌‌‌ న్యూట్రిషన్‌‌‌‌ ఇన్‌‌‌‌ ది వరల్డ్‌‌‌‌ 2024 (ఎస్ఓఎఫ్ఐ-2024)’  నివేదిక స్పష్టం చేసింది. ఆహార అభద్రత, పోషకాహార లోపాలు ప్రపంచ మానవాళిని వెంటాడుతున్నాయని, ఆసియా ఖండంలోనే అత్యధిక పోషకాహార లోపంతో బాధపడుతున్న ప్రజలు ఉన్నారని తెలుస్తున్నది. 

2023లో దాదాపు 2.33 బిలియన్ల ప్రపంచ ప్రజలు సాధారణ లేదా తీవ్రమైన ఆహార అభద్రతలో బతుకులు ఈడుస్తున్నారు. తీవ్రమైన ఆహార అభద్రతలో 864 మిలియన్ల  ప్రపంచ ప్రజలు ఉన్నారని, ప్రతి ఒక్కరికి రోజుకు సగటు ఆరోగ్యకర భోజన ఖర్చు 3.96 డాలర్లు ఉందని నివేదిక తెలిపింది. దాదాపు 55.6 శాతం భారతీయులు ఆరోగ్యకర 
భోజనాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తున్నది. 

మహిళలు,పిల్లల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఐదేళ్లలోపు పిల్లల్లో  స్టంటింగ్‌‌‌‌, వేస్టింగ్‌‌‌‌ సమస్యలు తగ్గినట్లు, ప్రపంచవ్యాప్తంగా స్థూలకాయ సమస్యలు పెరుగుతున్నట్లు అర్థం అవుతున్నది. 15–40 ఏండ్లలోపు మహిళల్లో రక్తహీనత పెరుగుతూ ప్రజారోగ్యం సమస్యగా నిలుస్తున్నదని పేర్కొనడమైనది.  భారత్‌‌‌‌లో ఆహార భద్రత, పోషకాహారం పెంచడానికి నిధులు పెంచినప్పటికీ ఇంకా ఎంతో ప్రగతి సాధించాల్సి ఉంది. 

భారత్‌‌‌‌లో ఆహార అభద్రత, పోషకాహార లోపం

ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌‌‌‌లో 194.6 మిలియన్ల  ప్రజలు  పోషకాహార లోపాలతో గడుపుతున్నారు. దీర్ఘకాలంపాటు ఆహార అభద్రత సమస్యలతో  సతమతం అవుతూ 13 శాతం ప్రజలు తీవ్రమైన  పోషకాహార లోప సమస్యలతో బాధ పడుతున్నట్లు తేలింది.  ‘2025 ప్రపంచ ఆకలి సూచీ’ జాబితాలో 123 దేశాలు ఉండగా.. అందులో భారత్‌‌‌‌ 102వ స్థానాన్ని ఆక్రమించడం మన దుస్థితిని స్పష్టం చేస్తోంది.  దక్షిణ ఆసియా దేశాల్లో ఇండియాలోనే అత్యధికంగా  18.7 శాతం వేస్టింగ్‌‌‌‌, అధికంగా 31.7 శాతం స్టంటింగ్‌‌‌‌ సమస్యలు పిల్లలకు ఎదురవుతున్నట్లు గమనించారు. 

పోషకాహార లోపం కలిగిన తల్లుల వల్ల 27.4 శాతం శిశువులు తక్కువ బరువుతో పుడుతున్నారని, ఇది ప్రపంచంలో అత్యధికమని వెల్లడించారు. భారతీయ మహిళల్లో 53 శాతం రక్తహీనత, 2.8 శాతం పిల్లల్లో/7.3 శాతం పెద్దల్లో స్థూలకాయం నమోదు అయ్యాయి. కొవిడ్‌‌‌‌-19 సమయంలో ఆదాయం పడిపోవడం, జీవనోపాధి తగ్గడం, ఆహార సరఫరా గాడి తప్పడంతో ఆహార అభద్రత,  పోషకాహార లోపం పెరిగిపోయాయని మనకు తెలుసు. 

ఎస్ఓఎఫ్ఐ- 2024 థీమ్‌‌‌‌గా  ‘ఆకలి, ఆహార అభద్రత, పోషకాహారలోపాలను అంతం చేయడానికి ఆర్థిక పెట్టుబడులు కావాలి’ అనే అంశాన్ని తీసుకున్నారు.  ఈ లక్ష్యంతో వ్యవసాయ ఆధార పరిశ్రమల ఏర్పాటు లేదా బలోపేతం చేయడం, అసమానతల తొలగింపు, ఆహార భద్రతను గాడిలో పెట్టడం, పోషకాహార  లభ్యతకు వనరుల కల్పన లాంటివి ఫలిస్తాయని ఆశిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి  సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి చేరడానికి కావలసిన ఆర్థిక వనరులను ఆయా ప్రభుత్వాలు ప్రాధాన్యతాక్రమంలో కేటాయించాలని, 2030 నాటికి ఆకలి కేకలు వినిపించరాదని ఐరాస కోరుకుంటున్నది. 

- బుర్ర మధుసూదన్ రెడ్డి