- బిహార్ సీఎంగా నితీశ్ ప్రమాణం
- ఎక్కువ సార్లు సీఎం పదవి చేపట్టిన నేతగా రికార్డ్
- బీజేపీ నుంచి డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా
- షూటర్ శ్రేయసి సింగ్‌కు కేబినెట్‌లో చోటు
- కమలం పార్టీకి 14, జేడీయూకు 8, ఎల్జేపీకి 2, హెచ్‌ఏఎం, ఆర్‌ఎల్‌ఎంకు ఒక్కోటి చొప్పున మంత్రి పదవులు
- ప్రధాని, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరు
పాట్నా:బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్డీయే సర్కార్ మళ్లీ అధికార పగ్గాలు చేపట్టింది. జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ పదోసారి సీఎంగా ప్రమాణం చేసి రికార్డు సృష్టించారు. నితీశ్ 10.0 కేబినెట్ లో మరో 26 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. సీఎం, మంత్రులతో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమం గురువారం పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఘనంగా జరిగింది.
దీనికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఎన్డీయే కూటమి కీలక నేతలు హాజరయ్యారు. వేలాది మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఎన్డీయేలో బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జేపీ (ఆర్‌వీ) 19, హెచ్‌ఏఎం 5, ఆర్‌ఎల్‌ఎం 4 కలిపి మొత్తం 202 సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారాన్ని దక్కించుకున్నాయి.
కేబినెట్‌లో 10 మంది కొత్తవాళ్లు..
26 మంత్రి పదవుల్లో బీజేపీకి14, జేడీయూకు 8, ఎల్జేపీ (ఆర్‌వీ)కి 2, హెచ్‌ఏఎం, ఆర్‌ఎల్‌ఎంకు ఒక్కోటి చొప్పున దక్కాయి. జేడీయూ నుంచి నితీశ్ సీఎం కాగా.. బీజేపీ నుంచి సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా డిప్యూటీ సీఎం పదవులు చేపట్టారు. వీళ్లిద్దరూ గత ప్రభుత్వంలోనూ డిప్యూటీ సీఎంలుగా పని చేశారు. హెచ్‌ఏఎం నుంచి జితన్‌రామ్ మాంఝీ కొడుకు సంతోష్ కుమార్ సుమన్‌కు మంత్రి పదవి దక్కింది.
ఆర్‌ఎల్‌ఎం నుంచి ఆ పార్టీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహా కొడుకు దీపక్ ప్రకాశ్‌కు చోటు లభించింది. ఈయన ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. ఎమ్మెల్సీని చేసే అవకాశం ఉంది. కేబినెట్‌లో మొత్తం16 మంది పాతవాళ్లు ఉండగా, 10 మంది కొత్తవాళ్లు ఉన్నారు. ఓసీలు 8 మంది, దళితులు 5 మంది, ఓబీసీ/ఈబీసీలు13 మంది, ముస్లిం ఒక్కరు ఉన్నారు. కాగా, రాష్ట్ర కేబినెట్‌లో సీఎం సహా 36 మంది మంత్రులు ఉండేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మంత్రివర్గాన్ని విస్తరించేందుకు చాన్స్ ఉంది.
