జడ్చర్ల, వెలుగు : యాసిడ్ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం వద్ద హైదరాబాద్ – బెంగళూరు హైవే 44 పై గురువారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే...
జగన్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు40 మంది ప్రయాణికులతో చిత్తూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది. ఈ క్రమంలో మాచారం వద్దకు రాగానే యాసిడ్ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సులో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదం కారణంగా ట్యాంకర్ నుంచి యాసిడ్ లీక్ కావడంతో సమాచారం అందుకున్న జడ్చర్ల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు. ఎస్పీ జానకి, మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ప్రమాదస్థలానికి వచ్చి ప్రయాణికులతో మాట్లాడారు.
కారులో చెలరేగిన మంటలు
సిద్దిపేట, వెలుగు : కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, అందులో ఉన్న వారు త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ వద్ద రాజీవ్ రహదారిపై గురువారం జరిగింది.
కరీంనగర్‌కు చెందిన జమీల్ అహ్మద్ తన కుటుంబ సభ్యులతో కలిసి సిద్దిపేటకు వస్తున్నాడు. ఇబ్రహీంనగర్ వద్దకు రాగానే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన వారు వెంటనే పక్కకు ఆపి కారులోంచి దిగిపోయారు. ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు.
ఇంజిన్‌లో మంటలు.. దగ్ధమైన లారీ
జహీరాబాద్, వెలుగు : ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో ఓలారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కోహిల్ మండలం దిగ్వాల్ సమీపంలో గురువారం జరిగింది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు కేబుల్ లోడ్‌తో వస్తున్న ఓ లారీ దిగ్వాల్ సమీపంలోకి రాగానే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి.
మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే లారీని పక్కకు ఆపి అందులోంచి దిగిపోయాడు. మంటలు పెద్దఎత్తున లేచి లారీతో పాటు కేబుళ్లు సైతం కాలిబూడిద అయ్యాయి. ప్రమాదంలో హైదరాబాద్ – ముంబై హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
