హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం పది మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు మినహా మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ గురువారంతో పూర్తయింది. చివరి రోజున ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీ తరఫు అడ్వకేట్లు, పిటిషన్ దారుల తరఫు అడ్వకేట్ల మధ్య వాదోపవాదాలు జరిగాయి.
ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎదుట ఇరువర్గాల అడ్వకేట్లు తమ వాదనలను వినిపించారు. పోచారం, అరికెపూడి గాంధీ.. కాంగ్రెస్ లో చేరారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసినంత మాత్రాన ఆ ఇద్దరు పార్టీ మారినట్టు ఆరోపణలు చేయడం సరికాదని వారి తరఫు అడ్వకేట్లు వాదించారు.
అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చింది కూడా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా గుర్తించేనన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్ష పార్టీకి దక్కుతుందన్నారు. గాంధీని కూడా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించే ఆ పదవి ఇచ్చిందని ఆయన తరఫు అడ్వకేట్ వాదించారు.
ఇక పిటిషన్ దారులైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ తరఫున అడ్వకేట్లు వాదిస్తూ.. పోచారం, అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారనేందుకు తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. పీఏసీ చైర్మన్ పదవి విషయంలో అరికెపూడి గాంధీ వాదనలు సరైనవి కాదని, సాంకేతిక కారణాలను అడ్డంపెట్టుకొని పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్‌దారుల అడ్వకేట్లు వాదించారు.
సాయంత్రం వరకు ఇరువర్గాల వాదనలను విన్న స్పీకర్ విచారణ ముగించారు. రెండు విడతల్లో నలుగురిచొప్పున మొత్తం 8మంది ఎమ్మెల్యేల విచారణను ట్రిబ్యునల్ పూర్తి చేసింది. ఇక మిగిలిన ఇద్ద రు ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్, కడియం గతంలో స్పీకర్పంపిన నోటీసులకు వివరణ ఇవ్వలేదు.
దీంతో గురువారం స్పీకర్ ఆ ఇద్దరికి రెండోసారి నోటీసులు పంపించారు. స్పీకర్ రెండోసారి పంపిన నోటీసులపై దానం, కడియం ఏ విధంగా స్పందించనున్నారనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొన్నది.
