హైదరాబాద్, వెలుగు: ఓఆర్ఎస్ పేరు వాడుకుంటూ జనాన్ని మోసం చేస్తున్న సంస్థలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్రూట్ జ్యూస్ లు, ఎనర్జీ డ్రింక్స్, రెడీ- టు- సర్వ్ డ్రింక్స్‌కు ఓఆర్ఎస్ అని పేరు పెట్టి అమ్మితే సహించేది లేదని హెచ్చరించింది. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నింటిని షాపులు, ఆన్ లైన్ స్టోర్ల నుంచి తొలగించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చింది.
ఇప్పటికే అక్టోబర్‌లో ఆదేశించినప్పటికీ.. అమ్మకాలు ఆగకపోవడంతో రాష్ట్రాల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు రంగంలోకి దిగాలని సూచించింది. ఎక్కడైనా రూల్స్ కు విరుద్ధంగా ఓఆర్ఎస్ పేరుతో కూల్ డ్రింక్స్, జ్యూస్ లు కనిపిస్తే వాటిని వెంటనే సీజ్ చేసి, సదరు కంపెనీలపై ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
