6 నెలలు.. 6 వేల మంది కార్మికులు..65 లక్షల చీరలు..గడువులోపే లక్ష్యం చేరిన సిరిసిల్ల నేతన్నలు

6 నెలలు.. 6 వేల మంది కార్మికులు..65 లక్షల చీరలు..గడువులోపే లక్ష్యం చేరిన సిరిసిల్ల నేతన్నలు
  • రెండు షిఫ్ట్‌‌లలో పనిచేస్తూ 4.30 కోట్ల మీటర్ల క్లాత్‌‌ ఉత్పత్తి
  • త్వరలో రెండో చీర ఉత్పత్తికి ఆర్డర్‌‌ !

రాజన్నసిరిసిల్ల, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు అందజేస్తున్న ఇందిరమ్మ చీరల ఉత్పత్తిని సిరిసిల్ల నేతన్నలు అత్యంత వేగంగా పూర్తి చేశారు. ఆరు వేల మంది కార్మికులు ఆరు నెలల పాటు పనిచేసి మొత్తం 65 లక్షల చీరలను తయారు చేశారు. మొత్తం చీరలను సెప్టెంబర్‌‌లో అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం గడువు విధించగా.. కార్మికులు రెండు షిఫ్ట్‌‌లలో పనిచేసి డెడ్‌‌లైన్‌‌లోపే చీరలు తయారు చేసి అందించారు.

మే నుంచి ప్రారంభమైన ఉత్పత్తి

కాంగ్రెస్‌‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా సంఘాలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా చీరల ఉత్పత్తి కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో సిరిసిల్ల నేత కార్మికులకు ఆర్డర్‌‌ ఇచ్చింది. కూలీ ఒప్పందం ఖరారు కావడానికి మరో మూడు నెలలు పట్టింది. 

మే నెలలో కూలీ ఖరారు కావడంతో అదే నెల నుంచి క్లాత్‌‌ ఉత్పత్తి ప్రారంభమైంది. మే నుంచి అక్టోబర్ వరకు మొత్తం 4.30 కోట్ల మీటర్ల క్లాత్‌‌ను ఉత్పత్తి చేశారు. తయారీ పూర్తయిన క్లాత్‌‌ను వెంట వెంటనే చేనేత జౌళిశాఖ ఆఫీసర్లు ప్రొక్యూర్‌‌ చేసి ప్రాసెసింగ్‌‌ కోసం హైదరాబాద్‌‌కు పంపించారు. అక్కడ ప్రాసెసింగ్‌‌ పూర్తి కాగానే ఆ చీరలను ప్రభుత్వం గత నెల నుంచి జిల్లాలకు పంపించడం మొదలు
పెట్టింది.

ఆరు వేల మంది కార్మికులు.. ఆరు నెలలు పని

సిరిసిల్లలో ఇందిరమ్మ చీరల ఉత్పత్తి కోసం ఆరు వేల మంది ఆరు నెలల పాటు కష్టపడ్డారు. రెండు షిఫ్ట్‌‌లలో పనిచేస్తూ 65 లక్షల చీరల ఉత్పత్తి కోసం అవసరమైన 4.30 కోట్ల మీటర్ల క్లాత్‌‌ను ఉత్పత్తి చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్‌‌తో సిరిసిల్ల పవర్‌‌లూం కార్మికులకు ఆరు నెలల పాటు చేతినిండా పని దొరికింది. దీంతో ఒక్కో కార్మికుడు నెలకు సుమారు రూ.20 వేల వరకు సంపాదించారు. 

పల్లెలకు చేరుతున్న చీరలు

ఇందిరమ్మ చీరల ఉత్పత్తి పూర్తి కావడంతో పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. రెడీ అయిన చీరలను ప్రభుత్వం డీఆర్డీవో ఆఫీసర్లకు పంపింది. అక్కడి నుంచి మండల కేంద్రాలు, గ్రామాలకు చీరలను పంపుతున్నారు. గ్రామాలకు చేరిన చీరలను మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేసేందుకు ఆఫీసర్లు సిద్ధం అవుతున్నారు. కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్‌‌ నాటికి రెండేండ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రజాపాలన సంబరాల్లో భాగంగా డిసెంబర్‌‌ 4 నుంచి చీరలను పంపిణీ చేసేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

రెండో చీర ఉత్పత్తి కోసం ఆర్డర్లు

మహిళా సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున ఇస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఈ మేరకు ప్రస్తుతం ఒక చీర చొప్పున ఉత్పత్తి చేయించింది. ఈ చీరలు పంపిణీకి సిద్ధంగా ఉండడంతో.. త్వరలోనే రెండో చీర ఉత్పత్తికి సైతం ఆర్డర్ వస్తుందని సిరిసిల్ల నేతన్నలు చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌‌ సిగ్నల్‌‌ రావాల్సి ఉంది.

నెలకు రూ. 20 వేలు సంపాదించా 

నేను వైపని కార్మికుడిని. భీములు నింపుతాను. ఇందిరమ్మ చీరల ఉత్పత్తి టైంలో నేను నెలకు రూ. 20 వేలు సంపాదించాను. ఆరు నెలలు చేతినిండా పని దొరికింది. చివరి నెల డేఅండ్‌‌నైట్‌‌ పని చేయడం వల్ల రూ. 30 వేల వరకు వచ్చాయి. ఈ సర్కార్‌‌ వచ్చాక సేట్లు కూడా వెంటవెంటనే డబ్బులు ఇచ్చారు. ఆరు నెలలు పని దొరకడం ఆనందంగా ఉంది. 

- ఆడేపు సత్యనారాయణ, వైపని కార్మికుడు, సిరిసిల్ల పట్టణం-

సర్కార్‌‌కు రుణపడి ఉంటాం 

సిరిసిల్ల నేతన్నలం సర్కార్‌‌కు రుణపడి ఉంటాం. పెండింగ్‌‌లో ఉన్న బతుకమ్మ చీరల బకాయిలను తీర్చడంతో పాటు ఇందిరమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడం వల్ల వ్యాపారం గాడిన పడింది. కార్మికులతో పాటు ఆసాములకు సైతం పని దొరికింది. రెండో చీర ఉత్పత్తి ఆర్డర్‌‌ను సైతం సిరిసిల్లకే కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఆనందంగా ఉంది. ఇందిరమ్మ చీరలకు సంబంధించి ప్రొక్యూర్‌‌ అయిన క్లాత్‌‌కు ఇప్పటికే 20 శాతం అమౌంట్‌‌ విడుదల చేసింది.

- ఆడేపు భాస్కర్, పాలిస్టర్‌‌ అసోసియషన్‌‌ ప్రెసిడెంట్, సిరిసిల్ల-