తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా ‘అష్టపది’

తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా ‘అష్టపది’

తెలంగాణలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంగా పెట్టుకుంది.  భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, తెలంగాణ ఎదుగుదలకు కూడా అదే సంవత్సరాన్ని లక్ష్యంగా చేసుకొని ‘తెలంగాణ రైజింగ్ 2047’ నినాదంతో ‘అష్టపది’ అభివృద్ధి పంథాను ఎంచుకుంది. రాష్ట్రంలో విద్య, ఉపాధి, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, సుస్థిర సమగ్ర అభివృద్ధి, సమాన అవకాశాలు తదితర లక్ష్యాల సాధనకు 8 రంగాల్లో అభివృద్ధికి ‘అష్టపది’ స్ఫూర్తిగా ప్రత్యేక వ్యూహాలు రచించింది. వచ్చే రెండు దశాబ్దాల కాలంలో ముఖ్యంగా ఈ రంగాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టి ‘2047 విజన్ డాక్యుమెంట్’ రూపొందిస్తోంది.

తెలంగాణ విజన్ ప్రపంచం నలుమూలలా విస్తరించేలా డిసెంబర్ 8, 9వ తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ నిర్వహించనుంది.  తెలంగాణ విజన్​ను విజయవంతంగా పూర్తి చేయాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేక చర్యలు చేపట్టింది.  తెలంగాణ అభివృద్ధి విజన్ లక్ష్యంగా ప్రభుత్వం నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకోకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల అభిప్రాయాలను తీసుకొని ఆ స్ఫూరితో డాక్యుమెంట్ రూపొందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి ఒక నిర్దేశిత  పత్రంలో ప్రజల స్పందన స్వీకరించి వాటి ఆధారంగా ప్రధానమైన 
8 రంగాలను ప్రభుత్వం గుర్తించింది.  

విద్య, ఆరోగ్యానికి ప్రాధాన్యత

‘అష్టపది’ లక్ష్యంగా తెలంగాణ విజన్ రూపొందించిన ప్రభుత్వం మానవ వనరుల బలోపేతానికి ఆరోగ్యం, విద్యకు  ప్రాధాన్యతిస్తోంది. ఇందులో భాగంగా పాఠశాలల అభివృద్ధికి జవాబుదారీతనం పెంచుతోంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు పెంచడంతోపాటు గురుకులాల అభివృద్ధికి చర్యలు తీసుకున్న ప్రభుత్వం మరింత కృషికి ప్రణాళికలు రూపొందిస్తోంది.  రాష్ట్రంలో ఆరోగ్యాభివృద్ధికి ప్రాధాన్యతిస్తూ ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధికి ‘2047 విజన్’ లక్ష్యంలో భాగంగా మాతా శిశు ఆరోగ్య వ్యవస్థల బలోపేతం,  మానసిక ఆరోగ్యం, వృద్ధుల సంరక్షణ, ఆరోగ్య రంగంలో డిజిటల్, ఏఐ సాంకేతికత వినియోగంపై  ప్రత్యేక దృష్టి 
పెట్టబోతోంది.

మహిళా సాధికారతే లక్ష్యం

విద్య, ఉద్యోగం, పరిశ్రమలు, క్రీడల్లో ఏదో ఒకటి యువత తప్పనిసరిగా ఎంచుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర అభివృద్ధిలో మహిళలను కేంద్ర బిందువుగా చేయాలనే సంకల్పంతో అమ్మాయిలకు రక్షణ కల్పించడంతోపాటు వారికి ఉన్నత విద్యావకాశాలు కల్పించడం, మహిళా వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించడానికి విజన్​లో ప్రాధాన్యం ఇచ్చారు. మహిళా సాధికారత కోసం ఇప్పటికే ప్రభుత్వం కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంగా ‘ఇందిరా మహిళా శక్తి ఫథకం’ కింద రాష్ట్రంలో మహిళలను ప్రోత్సహిస్తోంది.  

రైతుల సంక్షేమమే లక్ష్యంగా ‘2047 విజన్’ లో వ్యవసాయాన్ని శాస్త్రీయంగా, లాభదాయకంగా మార్చేందుకు ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది.  పరిశోధనలు ప్రోత్సహించి అంతర్జాతీయస్థాయిలో విత్తనోత్పత్తి,  సాంకేతికత వినియోగంతో స్మార్ట్  వ్యవసాయం, వైవిధ్యకరమైన పంటలకు మంచి మార్కెటింగ్ కల్పించడంతో పాటు గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యతిస్తూ వాటికి ఆర్థిక పరిపుష్టి  కలిగే  వ్యూహాలను రచిస్తోంది.

3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ

బలమైన ఆర్థికవ్యవస్థతోనే ‘తెలంగాణ రైజింగ్ 2047’ సాధ్యమని విశ్వసిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధిని లక్ష్యంగా విధించుకుంది. ఇందుకు మానవ వనరులను బలోపేతం చేయడం, పరిశోధనలు ప్రోత్సహించి ఉత్పాదకత పెంపు, పలు రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడం చర్యలు తీసుకోనుంది.  ఇందుకు దేశ విదేశీ పెట్టుబడుల కోసం సులభతర వ్యాపార వాతావరణం కల్పిస్తోంది. 

సుపరిపాలనతో స్థిరమైన విధానాలు తీసుకొని టీజీ ఐపాస్ ద్వారా అనుమతులివ్వడం, ఏవైనా సమస్యలుంటే పరిష్కరించడం, పారిశ్రామిక కారిడార్లు,  లాజిస్టిక్ హబ్​లు వంటి ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యతిస్తోంది. అభివృద్ధిని హైదరాబాద్ నగరానికే పరిమితం చేయకుండా వికేంద్రీకరణ చేయాలనే సదుద్ధేశంతో రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి అవకాశాలు కల్పించేలా పాలీసెంట్రిక్ అభివృద్ధి నమూనాను రూపొందిస్తోంది.  ఓఆర్ఆర్,  త్రిబుల్ ఆర్ ప్రాంతాల్లో మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్ హబ్ గా అభివృద్ధిపరచడంతోపాటు పట్టణాలను, మండలాలను ఆర్థిక క్లస్టర్లుగా మార్చనుంది. 

సకల సౌకర్యాలతో ‘ఫ్యూచర్ సిటీ’ 

రాష్ట్రంలో హైదరాబాద్ మెట్రో పాలిటన్ రీజియన్​కు వేగంగా చేరుకునేలా మౌలిక వసతులు కల్పిస్తోంది.  నగరం నలువైపులా మెట్రో రైలు విస్తరణకు ప్రణాళికలు రూపొందించింది. 2047 నాటికి రాష్ట్రాన్ని ‘నెట్ జీరో’గా తీర్చిదిద్ధేందుకు  పర్యావరణానికి  ప్రాధాన్యతిస్తోంది. ‘విజన్ 2047’ లక్ష్యాన్ని  విజయవంతంగా  అందుకోవాలంటే  ఆర్థిక వనరుల ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటికే చర్యలు తీసుకుంది.  దావోస్  వేదికగా నిర్వహించే ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’ సమావేశాల్లో 2024లో రూ.40, 832 కోట్లు,  2025లో  రూ.1,78,50 కోట్ల పెట్టుబడులతో  పరిశ్రమల ఏర్పాటుకు  తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నది.   

కంపెనీలను  ఆకర్షించేందుకు గ్రేటర్ హైదరాబాద్ శివార్లలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ‘ఫ్యూచర్ సిటీ’ సకల సౌకర్యాలతో ఎంతో దోహదపడుతోంది.  రాష్ట్ర భవిష్యత్ తరాల్లో భరోసా నింపేలా ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంగా రూపొందిస్తున్న ప్రణాళికలపై ఆసక్తి నెలకొంది.  తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశ, విదేశీ పెట్టుబడులకు సోపానంగా మారుతున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రజల ఆశయాలకు అనుగుణంగా విజన్​లో అన్ని రంగాలకు పెద్దపీట వేస్తోంది.  రాష్ట్ర ప్రజలకే  కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా తెలంగాణ ఒక దిక్సూచిగా మారాలనేదే  తెలంగాణ రైజింగ్​2047 లక్ష్యంగా కనిపిస్తోంది.

- ఐ.వి.మురళీకృష్ణ శర్మ,
సీనియర్ జర్నలిస్ట్