మూడు డిజైన్లలో ఇందిరమ్మ ఇండ్లు .. త్వరలో ఫైనల్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

మూడు డిజైన్లలో ఇందిరమ్మ ఇండ్లు  .. త్వరలో ఫైనల్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
  • ఇండ్ల నమూనాలు రెడీ చేసిన అధికారులు
  • 11న లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నమూనాలు సిద్ధమయ్యాయి. మొత్తం మూడు డిజైన్లను అధికారులు సిద్ధం చేయగా, ఆ నమూనాలను త్వరలో సీఎం రేవంత్​రెడ్డి,  గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైనల్ చేయనున్నారు. ప్రభుత్వ సూచనల ప్రకారం హౌసింగ్ అధికారులు మూడు డిజైన్లలో ఇండ్ల నమూనాలు రెడీ చేశారు. వీటిని ముఖ్యమంత్రికి చూపించేందుకు బుధవారం సచివాలయానికి తీసుకురాగా, సీఎం రాకపోవడంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది.

ఈ నమూనాలను రేవంత్​కు గురువారం చూపించేందుకు ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.  500,400 ఎస్​ఎఫ్​టీ విస్తీర్ణంలో హాల్, కిచెన్, బెడ్ రూమ్, టాయిలెట్​ ఉండేలా ఈ మూడు డిజైన్లను రూపొందించారు .ఈ నెల 11న భద్రాచలం నియోజకవర్గంలోని బూర్గంపాడు పబ్లిక్ మీటింగ్​లో ఇందిరమ్మ ఇండ్ల స్కీం ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అదే సమయంలో పలువురు లబ్ధిదారులకు సీఎం చేతుల మీదుగా ఇంటి మంజూరు పత్రాలు  అందజేయనున్నారని హౌసింగ్ అధికారులు తెలిపారు. ఈ పత్రాలు సైతం అధికారులు రెండు డిజైన్లలో రెడీ చేశారు. సోమవారం స్కీం లాంచ్​ చేస్తుండటంతో గురువారం లేదా శుక్రవారం ఫైనల్ కానున్నట్టు తెలుస్తున్నది.

ప్రజా పాలనలో పేదోడి సొంతింటి కల సాకారం: మంత్రి పొంగులేటి

ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేస్తుండగా, ఈ నెల 11న భద్రాచలం రాములవారి  సన్నిధిలో ఐదో గ్యారెంటీ అయిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సీఎం రేవంత్​ ప్రారంభించనున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హామీలు ఇవ్వడమే కాదు ఇచ్చిన ప్రతి హామీని ఆచరణలో అమలు చేయడమే ఇందిరమ్మ రాజ్యమని, ముఖ్యంగా పేదవాడికి సొంతిల్లు ఒక కల.. అది నెరవేరితే పేదవాడి ఇంట పండుగే అని తెలిపారు.

పేదలకు ఇండ్లు ఇవ్వడం  ప్రభుత్వాల కర్తవ్యం అని, గత పాలకులు ఈ కర్తవ్యాన్ని విస్మరించారని విమర్శించారు.  ప్రజల అవసరాలను, ఆశలను గత ప్రభుత్వం వారి రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకున్నదని మండిపడ్డారు.  ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్,  జిల్లా కలెక్టర్లు, మున్సిపల్​ కమిషనర్లు  పర్యవేక్షిస్తారని తెలిపారు. తొలి విడతలో సొంత స్థలం కలిగిన వారికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయనున్నామని వివరించారు. 400 చదరపు అడుగులకు తక్కువ కాకుండా ఇండ్లను నిర్మించాలని, హాలు, బెడ్ రూమ్ తో పాటు వంటగది, బాత్ రూమ్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు.

మహిళల పేరుపైన ఇండ్లను మంజూరు చేస్తామని, ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆహార భద్రత కార్డు ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక చేస్తామని చెప్పారు.  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలని అధికారులకు సూచించారు. పేదవారి సొంతింటి కల ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి నాయకత్వంలోని  కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నెరవేరబోతున్నదని తెలిపారు.