
- శాస్త్రీయంగా విభజించనున్న సర్కారు
- సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో ప్రత్యేక కమిషన్!
- రాజకీయ అవసరాలకు అస్తవ్యస్తంగా జిల్లాలను ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సర్కారు
- మండలాలు, డివిజన్ల ఏర్పాటు కూడా ఆగమాగమే
- వాటిని పునర్వ్యవస్థీకరించేందుకు సర్కారు కసరత్తు
- పాలనయోగ్యమైన జిల్లాలు, మండలాల ఏర్పాటు
హైదరాబాద్: రాజకీయ అవసరాల కోసం బీఆర్‌ఎస్ సర్కారు ఏర్పాటు చేసిన 33 జిల్లాల పునర్వ్యవస్థీకరణ దిశగా సర్కారు అడుగులు వేయనుంది. ఇందుకోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేయనున్నది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో జరిగిన లోపాలను సవరించిన శాస్త్రీయంగా, పాలనా యోగ్యంగా ఏర్పాటు చేయనున్నది. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 23 జిల్లాలుండగా 10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఆ తర్వాత రాజకీయ అవసరాలకు, సంబంధిత ప్రాంతంలో ఉన్న నాయకుల ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు బీఆర్ఎస్ సర్కారు 33 జిల్లాలను ఏర్పాటు చేసిందనే విమర్శలున్నాయి. గతంలో 37 రెవెన్యూ డివిజన్లుండగా వాటిని 74కు మార్చింది. 464 మండలాలను 607కు పెంచింది. మండలాల ఏర్పాటులో ఎలాంటి శాస్త్రీయ పద్ధతిని అవలంబించలేదనే విమర్శలున్నాయి. నాలుగైదు గ్రామాలతో కూడిన మండలాలు సైతం ఉండటం అప్పట్లో అనేక విమర్శలకు తావిచ్చింది. ఒకటిన్నర, రెండు నియోజకవర్గాలతో జిల్లాల ఏర్పాటుపైనా విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలో అప్పట్లో ఉన్న ఇన్ చార్జి మంత్రుల వ్యవస్థను కూడా బీఆర్ఎస్ సర్కారు నిర్వీర్యం చేసింది. ఇద్దరు ఎమ్మెల్యేలకు ఒక జిల్లా అన్నట్టుగా తయారైంది. జిల్లా పరిషత్ మీటింగ్ జరిగినా, జిల్లా సమీక్షా సమావేశాలు జరిగినా వాటికి ప్రాధాన్యం లేకుండా పోయింది. అప్పటి సీఎం కేసీఆర్ ఏదైనా మీటింగ్ కు వెళితే.. జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ రాగానే వారం రోజుల్లో జిల్లాను ఏర్పాటు చేస్తూ జీవో విడుదలయ్యేది. మండలాల ఏర్పాటు విషయమైతే ఎలాంటి అధ్యయనం లేకుండా జరిగిపోయిందనే విమర్శలు వచ్చాయి. పరిపాలనను చేరువ చేస్తున్నామని చెప్పుకొంటూ నాలుగైదు గ్రామాలను కలిపి మండలంగా ఏర్పాటు చేయడం, వాటికి సరిపడా ఆఫీసులు ఏర్పాటు చేయకపోవడం, అధికారులను నియమించకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పాలయ్యారు. వీటన్నింటిపై దృష్టి సారించిన కాంగ్రెస్ సర్కారు శాస్త్రీయంగా, పాలనకు అనుకూలంగా జిల్లాలను పునరుద్ధరించేందుకు సిద్ధవుతోందని తెలుస్తోంది.
నాలుగు జిల్లాలుగా హైదరాబాద్?
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ 625 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. గ్రేటర్ పరిధిలో 24 నియోజకవర్గాలున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ పేరుతో జిల్లానే లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. గ్రేటర్ లో అంతర్భాగమైన ఉప్పల్, మల్కాజ్ గిరి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ తదితర సెగ్మెంట్లు మేడ్చల్ జిల్లాలో మెర్జ్ చేశారు. పటాన్ చెరు సెగ్మెంట్ గ్రేటర్ లో ఉన్నా సంగారెడ్డి జిల్లాలోనే కొనసాగుతోంది. రాజేంద్రనగర్, ఎల్బీనగర్ సెగ్మెంట్లు గ్రేటర్ పరిధిలో కొనసాగుతున్నా అవి రంగారెడ్డి జిల్లా కిందకు వస్తున్నాయి. కేవలం జీహెచ్ఎంసీ పరిధినే నాలుగు జిల్లాలుగా విభజించే అవకాశం ఉన్నా.. సర్కారు ఆ దిశగా అడుగులు వేయలేదనే విమర్శలున్నాయి. వాటన్నింటినీ సవరించి జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
జిల్లాలు ఎన్నవుతాయి..?
పది జిల్లాల తెలంగాణ సీఎం కేసీఆర్ లక్కీ నంబర్ 6 వచ్చేలా 33 జిల్లాలుగా మార్చరనే విమర్శల నేపథ్యంలో శాస్త్రీయంగా పాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేసే రీ ఆర్గనైజేషన్ లో ఎన్ని జిల్లాలవుతాయనేది చర్చనీయాంగా మారింది. ఏపీలో మాదిరిగా పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చుతారా..? మరేదైనా శాస్త్రీయ పద్ధతిని ప్రామాణికంగా తీసుకొని జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తారా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది.