
హైదరాబాద్, వెలుగు: వివాహ బంధంలో పెరుగుతున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివాహ పూర్వ కౌన్సెలింగ్ కేంద్రాలు (ప్రీ మారిటల్ కౌన్సెలింగ్ సెంటర్లు) ఏర్పాటు చేయనుంది. రూ.5 కోట్ల అంచనా వ్యయంతో 33 జిల్లాల్లో ఒక్కో సెంటర్ చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఈ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన ఫైల్ పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శుక్రవారం సంతకం చేశారు.
ఆర్థిక శాఖ ఆమోదం లభించిన వెంటనే ఇవి అందుబాటులోకి రానున్నాయి. ప్రతి జిల్లాలో ప్రీమారిటల్ కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. వీటిని సఖీ, వన్ స్టాప్ సెంటర్లలో ఏర్పాటు చేసి, అవసరమైతే సొంత భవనాలు నిర్మిస్తారు. ప్రతి సెంటర్ లో ఒక లీగల్ కౌన్సెలర్, సైకాలజిస్టు, సోషల్ వర్కర్, హెల్పర్ వంటి నిపుణులు ఉంటారు. ఈ కౌన్సెలింగ్ వల్ల వివాహం ప్రారంభ దశలోనే తలెత్తే విభేదాలు తగ్గి, గృహహింస, కుంగుబాటు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది.
పెరుగుతున్న పోస్టు మారిటల్ కేసులు..
రాష్ట్ర మహిళా కమిషన్ కు, సఖీ వన్ స్టాప్ సెంటర్లకు ఇటీవల వివాహ సంబంధ ఫిర్యాదులు గణనీయంగా పెరుగుతున్నాయి. భిన్నాభిప్రాయాలు, అవగాహన లోపం, తల్లిదండ్రుల జోక్యం వంటి వాటితో వివాహం తర్వాత సమస్యలు ఎదురవుతున్నాయి. పూర్వకాలంలో పెద్దలు మార్గదర్శకత్వం ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో.. దంపతులు వివాహ బంధంలో అడుగుపెట్టే ముందు ఆ బంధం బాధ్యతలను, పరస్పర గౌరవాన్ని అర్థం చేసుకునేలా ప్రత్యేక కౌన్సెలింగ్ అవసరమని మంత్రి సీతక్క అన్నారు.