
- ఎనర్జీ వినియోగంపై ఆసక్తిగా ఉన్నం: భట్టి
- జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భేటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని, సోలార్ ఎనర్జీ వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సెక్రటేరియెట్‌లో జర్మనీ ప్రతినిధుల బృందంతో గురువారం ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సోలార్ ఎనర్జీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను జర్మనీ ప్రతినిధులు ప్రశంసించారు.
ఈ రంగంలో సాంకేతిక సహకారం అందించేందుకు పలు ప్రతిపాదనలు అందజేశారు. అనంతరం భట్టి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ‘గృహ జ్యోతి’ పథకం కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఈ రెండు విభాగాలకు సోలార్ పవర్ ద్వారా విద్యుత్ సరఫరా చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని వివరించారు.
వ్యవసాయ రంగంలో రైతులు వినియోగించే కరెంటు, గృహజ్యోతి లబ్ధిదారులకు స్థిరమైన నెలవారీ ఆదాయం కలిగేలా సోలార్ మోడల్ ప్రాజెక్ట్ రూపొందించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని చెప్పారు. జర్మనీ టెక్నాలజీని విద్యుత్ రంగంలో అమలు చేయడంతో పర్యావరణహిత, స్థిర విద్యుత్ ఉత్పత్తికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
జర్మనీ ప్రతినిధుల బృందం సమర్పించిన ప్రతిపాదనలను సమగ్రంగా అధ్యయనం చేయాలని ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్‌కు భట్టి సూచించారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో సీఎండీ డి.కృష్ణ భాస్కర్, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ, రెడ్కో సీఎండీ అనిల్, జర్మనీ ప్రతినిధులు డాక్టర్ సెబాస్టియన్, డాక్టర్ రఘు చలిగంటి తదితరులు పాల్గొన్నారు.