అభివృద్ధిలో తెలంగాణ టాప్‌‌.. రియల్ ఎస్టేట్ రంగానిది కీలక పాత్ర: మంత్రి జూపల్లి కృష్ణారావు

అభివృద్ధిలో తెలంగాణ టాప్‌‌..  రియల్ ఎస్టేట్ రంగానిది కీలక పాత్ర: మంత్రి  జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్, వెలుగు:  రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణ ఆర్థికాభివృద్ధిలో కీల‌‌క పాత్ర పోషిస్తోంద‌‌ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.  హైదరాబాద్‌‌లోని హైటెక్స్‌‌లో శుక్రవారం (అక్టోబర్ 10) జరిగిన నరెడ్కో తెలంగాణ 15వ‌‌ ప్రాప‌‌ర్టీ షోలో ఆయన  మాట్లాడారు. దేశంలోనే అత్యంత వేగంగా  తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదన్నారు. 

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక వసతులు హైదరాబాద్‌‌ను  అగ్రస్థానంలో నిలబెట్టాయన్నారు. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల విస్తరణకు రియల్ ఎస్టేట్ కీలక మౌలిక సదుపాయాలను అందిస్తోందని చెప్పారు. 

రియల్‌‌ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇటీవ‌‌ల ఎకరం స్థలం రూ.177 కోట్లకు అమ్ముడు పోవడమే దీనికి నిదర్శనమ‌‌ని అన్నారు. ప‌‌ర్యాట‌‌క రంగంలో రూ.15 వేల కోట్ల పెట్టుబ‌‌డులు ల‌‌భించ‌‌డంతో పెట్టుబ‌‌డిదారులు, రియ‌‌ల్టర్ల  విశ్వాసం మ‌‌రింత బలపడిందని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్, పర్యాటక రంగాలు పరస్పరం మద్దతుగా ఉండి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని వెల్లడించారు. 

ఆకట్టుకున్న ప‌‌ర్యాట‌‌క శాఖ స్టాల్ 

నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో తెలంగాణ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన  టూరిజం స్టాల్ సందర్శకులను  ఆకట్టుకున్నది. ఉప ముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క, మంత్రి  జూపల్లి కృష్ణారావు సంయుక్తంగా ఈ స్టాల్‌‌ను ఆవిష్కరించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప ఆలయం,  పులుల అభ‌‌యార‌‌ణ్యాలు, సోమ‌‌శిల‌‌, ల‌‌క్నవ‌‌రం, నాగ‌‌ర్జున సాగ‌‌ర్ బుద్ధవ‌‌నం, భువ‌‌న‌‌గిరి కోట‌‌, పాండ‌‌వుల గుట్ట వంటి ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల ఫొటో ప్రదర్శనను న‌‌రెడ్కో ప్రాప‌‌ర్టీ షో వేదికగా ప్రదర్శించారు. 

తెలంగాణ  సాంస్కృతిక వైభవం, చారిత్రక సంపద, సహజ సౌందర్యాన్ని సమన్వయంగా ప్రదర్శించిన ఈ స్టాల్,  ప్రాప‌‌ర్టీ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  భట్టి విక్రమార్క, కృష్ణారావు స్టాల్‌‌లోని ఫొటోలను తిల‌‌కించారు. ఈ ప్రాపర్టీ షోలో 80కి పైగా ప్రముఖ బిల్డర్లు, డెవలపర్లు, ఆర్థిక సంస్థలు పాల్గొన్నాయి.  అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో ఇది ఓపెన్‌‌లో ఉంటుంది.