- 2023–24లో 168.80 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి
- ఏపీ ఉత్పత్తి 73.40 లక్షల టన్నులే
- యూపీకి 2, బెంగాల్ కు 3, పంజాబ్ కు నాలుగో ప్లేస్
- కేంద్ర వ్యవసాయశాఖ డేటా వెల్లడి
హైదరాబాద్, వెలుగు: భారతదేశ ధాన్యాగారంగా గత దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించింది. 2023–-24 వ్యవసాయ సంవత్సరంలో బియ్యం ఉత్పత్తిలో మన రాష్ట్రం 168.80 లక్షల టన్నులతో మొదటి స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ (159.90 లక్షల టన్నులు) రెండో స్థానంలో, పశ్చిమ బెంగాల్ (156.90 లక్షల టన్నులు) మూడో స్థానంలో, పంజాబ్ (143.60 లక్షల టన్నులు) నాలుగో స్థానంలో నిలిచాయి.
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం బియ్యం ఉత్పత్తి 1,378.25 లక్షల టన్నులుగా నమోదైంది. అయితే 2024–25 నాటికి తెలంగాణలో బియ్యం ఉత్పత్తి 185.49 టన్నులకు చేరింది. అయితే ఇది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇటీవల విడుదలైన ఈ గణాంకాలు తెలంగాణ రైతుల కష్టానికి, ప్రభుత్వ విధానాలకు అద్దం పడతాయి.
పదేళ్ల క్రితం 2015లో తెలంగాణలో బియ్యం ఉత్పత్తి 30.50 లక్షల టన్నులుగా ఉండగా, 2023–24 నాటికి అది ఐదు రెట్లు పెరిగి 168.80 లక్షల టన్నులకు చేరింది. 2024–25 నాటికి ఇంకా పెరిగి 174.42లక్షల టన్నులకు చేరింది. దీనికి విరుద్ధంగా, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో 2015లో 74.90 లక్షల టన్నుల ఉత్పత్తి ఉండగా, 2023–24లో 73.40 లక్షల టన్నులకు పరిమితమైంది. అంటే తెలంగాణ ఉత్పత్తిలో సగం కూడా లేదు. ఈ మార్పు తెలంగాణను దేశంలోని ప్రముఖ బియ్యం ఉత్పత్తి రాష్ట్రంగా నిలబెట్టింది.
నీటి పారుదల, ప్రభుత్వ సహాయం
రాష్ట్రంలో బియ్యం ఉత్పత్తి పెరుగుదలకు నీటిపారుదల సౌకర్యాల విస్తరణ, ఉచిత విద్యుత్ సరఫరా, రైతులకు పెట్టుబడి అందించే పథకాలు ప్రధాన కారణాలుగా తెలుస్తున్నది. 2014-–15లో రాష్ట్రంలో సాగు నీటి సౌకర్యం తక్కువగానే అందుబాటులో ఉండగా, 2025 నాటికి రెండు సీజన్లు కోటిన్నర ఎకరాలను దాటేసింది. ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యామ్‌ల నిర్మాణం వంటివి రైతులకు నిరంతర నీటి సరఫరాను అందించాయి. అంతేకాకుండా, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా రైతుల భయాలను తొలగించి, సాగును సులభతరం చేసింది. రైతుకు పెట్టుబడి సాయం పథకం ద్వారా ఎకరాకు నగదు సహాయం, హైబ్రిడ్ విత్తనాలు, యాంత్రీకరణ వంటివి ఉత్పత్తిని పెంచాయి.
ఆర్థిక, సామాజిక ప్రభావం
రాష్ట్రంలో బియ్యం ఉత్పత్తి పెరుగుదల గ్రామీణ ఆదాయాలను పెంచి పేదరికాన్ని తగ్గించింది. వరి సాగు విస్తీర్ణం రెండు సీజన్లు కలిపి 2014–15లో 35 లక్షల ఎకరాల నుంచి 2023–-24లో 157.10 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇది రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా, దేశ ఆహార భద్రతకు దోహదపడుతోంది. అయితే, నీటి వనరుల అతి వినియోగం, భూగర్భ జలాల తగ్గుదల వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. నిపుణులు సుస్థిర వ్యవసాయ పద్ధతులు, పంటల వైవిధ్యీకరణను సూచిస్తున్నారు.
ఏపీతో పోలిస్తే తెలంగాణ స్థితి..
2015లో ఆంధ్రప్రదేశ్ బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ కన్నా 144 శాతం ముందుండగా, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏపీలో ఉత్పత్తి స్థిరంగా ఉండగా (74.90 నుంచి 73.40 లక్షల టన్నులు), తెలంగాణలో అది ఐదు రెట్లు పెరిగింది. ఏపీలో వ్యవసాయం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) లో 30 శాతం వాటా ఉండగా, తెలంగాణలో అది 16 శాతమే. అయినప్పటికీ, తెలంగాణ ఉత్పత్తి రెట్టింపు అయింది.
