ట్రెక్కింగ్.. సైక్లింగ్.. హంటింగ్!.. పర్యాటకులకు అడ్వెంచర్ ట్రీట్... తెలంగాణ టూరిజంశాఖ నయా ప్లాన్..

ట్రెక్కింగ్.. సైక్లింగ్.. హంటింగ్!.. పర్యాటకులకు అడ్వెంచర్ ట్రీట్... తెలంగాణ  టూరిజంశాఖ నయా ప్లాన్..
  •     గైడ్లుగా హరిత హోటల్ సిబ్బంది 
  •     నెల రోజులు స్పెషల్ ట్రైనింగ్.. 
  •     అడవి, జలపాతాలు, సౌండ్ మెడిటేషన్, ట్రెక్కింగ్, ఫిషింగ్, సైక్లింగ్ చేసేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపకల్పన
  •     పర్యాటకుల కోసం టూరిజంశాఖ సరికొత్త కార్యాచరణ రెడీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పర్యాటక రంగం రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నది. జాతీయ, అంతర్జాతీయ టూరిస్టులను ఆకట్టుకునేలా యాక్షన్​ప్లాన్ రెడీ చేసింది. ఇందులోభాగంగా అడ్వెంచర్ టూరిజంపై ఫోకస్ పెట్టింది. పర్యాటకులకు మధురానుభూతి కలిగించేలా కేరళ, కర్ణాతక తరహాలో సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. అడవిలో నడక (ట్రెక్కింగ్), చెరువుగట్టున చేపల వేట (ఫిష్​హంటింగ్, యాంగ్లింగ్), ప్రకృతి ఒడిలో సైకిల్ సవారీ.. ఇలా అడ్వెంచర్ ను ఇష్టపడేవారి కోసం వినూత్న కార్యక్రమాలు రూపొందిస్తున్నది. 

పర్యాటకులకు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, జలపాతాలు, ఫారెస్ట్ పార్కులు, ప్రాజెక్టులు, ఆలయాలు తదితర ప్రాంతాలపై ప్రాధాన్యత వివరించడం, వాటి ప్రాశస్త్యాన్ని టూరిస్ట్​లకు తెలియజేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇందుకోసం బయటి వ్యక్తులపై ఆధారపడకుండా టూరిజంశాఖలో హరిత హోటల్స్​లో పనిచేస్తున్న సిబ్బందినే టూరిజం గైడ్లుగా తీర్చిదిద్దేలా కసరత్తు చేస్తున్నది.

హరిత సిబ్బందికి ట్రైనింగ్

రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 23 వరకు హరిత హోటళ్లు, రెస్టారెంట్లు అందుబాటులో ఉన్నాయి. నాగార్జున సాగర్, వరంగల్, అనంతగిరి, భద్రాచలం, రామప్ప, వేములవాడ, సిద్దిపేట వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఈ హరిత హోటళ్లు విస్తరించి ఉన్నాయి. ఇందులో దాదాపు 350 నుంచి 400 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 

ఇప్పటివరకు హరిత హోటల్స్ లో ఫుడ్ సర్వ్ చేసే సిబ్బంది, రూం బాయ్స్ ను ఆ పనులకే పరిమితం చేయకుండా మల్టీపర్పస్​గా వినియోగించుకోవాలని టూరిజం శాఖ భావిస్తున్నది. వారిని టూరిస్ట్ గైడ్లుగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా నెల రోజులపాటు స్పెషల్​ట్రైనింగ్ ఇచ్చేలా టూరిజంశాఖ ప్లాన్ చేస్తోంది. 

పర్యాటకులతో ఎలా మాట్లాడాలి? మన రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటి ప్రాధాన్యత, విశిష్టత, చరిత్ర, ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ఏ జిల్లాలో ఫారెస్ట్ ఉంది. అక్కడ ఏ జంతువులు, పక్షులు ఉంటాయి? సేఫ్టీ మెజర్స్ ఇలా పలు అంశాలపై వీరికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులకు వీరు అందుబాటులో ఉండటంతోపాటు సైట్ సీయింగ్ కు తీసుకెళ్తారు.

ప్రకృతితో మమేకమయ్యేలా.. 

రాష్ట్రంలో కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాలకు కొదవలేదు.  రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలను చూస్తూ ట్రెక్కింగ్ చేయొచ్చు. జలపాతాల వద్ద సందడి, చెరువులు, సరస్సులు, ప్రాజెక్టుల వద్ద సరదా షిష్ హంటింగ్, పచ్చని చెట్ల మధ్య ప్రకృతిని ఆస్వాదిస్తూ సైక్లింగ్ చేసేలా టూరిస్ట్​ల కోసం పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 

వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్ దట్టమైన అడవిలో ట్రెక్కింగ్, భువనగిరి కోట, అడవిలో నడుచుకుంటూ వెళ్లి బోగత, కుంటాల లాంటి జలపాతాలు చూడటం, ఫిష్ హంటింగ్ పర్యాటకులకు చక్కని అనుభూతి కలిగిస్తాయి.  ప్రకృతి రమణీయమైన ప్రదేశాలకు పర్యాటలకులను తీసుకెళ్లడంతోపాటు ప్రకృతితో మమేకమయ్యేలా సరికొత్త కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.  

పర్యాటకుల కోసం హరిత హోటల్స్ లోనే సైకిళ్లను అందుబాటులో ఉంచనున్నారు. వికారాబాద్ అటవీ ప్రాంతం, కవ్వాల్ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్, పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అమ్రాబాద్ మన్ననూర్ చెక్ పోస్ట్ పరిసరాల్లో సైక్లింగ్ కు అనువుగా ఉంటాయని పర్యాటకులు భావిస్తున్నారు. అంతేకాదు, మనసుకు ప్రశాంతత కోసం ‘సౌండ్ మెడిటేషన్’ కూడా చేయించనున్నారు. అడవిలో పక్షుల కిలకిలారావాల మధ్య, ప్రకృతి శబ్దాలను వింటూ ధ్యానం చేసేలా టూరిజంశాఖ ప్లాన్ చేస్తున్నది. తెలంగాణ సంస్కృతి, బర్డ్ వాచింగ్, వైల్డ్ లైఫ్ పై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.

అనుభూతిని పంచే పర్యాటకమే ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్రంలో అద్భుతమైన అటవీ సంపద, జలపాతాలు, ట్రెక్కింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఎన్నో అందమైన ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. అందుకే  ఎక్స్‌‌పీరియెన్షియల్ టూరిజం (అనుభూతినిచ్చే పర్యాటకం)పై ప్రత్యేక దృష్టి పెట్టాం. కేవలం చూసి వెళ్లిపోవడం కాకుండా పర్యాటకులు ఆ ప్రదేశంతో మమేకమయ్యేలా ట్రెక్కింగ్, సైక్లింగ్, ఫిషింగ్ వంటి యాక్టివిటీస్‌‌ను అందుబాటులోకి తెస్తున్నాం. 

ఇందుకోసం హరిత సిబ్బందికే గైడ్లుగా శిక్షణ ఇస్తున్నాం. దీనివల్ల పర్యాటకులకు భద్రతతోపాటు మంచి ఆతిథ్యం లభిస్తుంది. వీకెండ్స్ లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసేలా, యూత్ కు అడ్వెంచర్ అనుభూతి ఇచ్చేలా టూరిజం క్లస్టర్లపై ప్రత్యేక దృష్టిసారించాం.     - టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి