4 నెలల్లోపు గ్రూప్ -1 రిజల్ట్!.. కసరత్తు ప్రారంభించిన టీజీపీఎస్సీ

4 నెలల్లోపు గ్రూప్ -1 రిజల్ట్!..  కసరత్తు ప్రారంభించిన టీజీపీఎస్సీ
  • ఇంటర్వ్యూలు లేకపోవడంతో రాతపరీక్షలో వచ్చిన  మార్కులే కీలకం 
  • అత్యంత జాగ్రత్తగా వాల్యుయేషన్

హైదరాబాద్, వెలుగు: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో, పరీక్షా ఫలితాలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) దృష్టి సారించింది. అభ్యర్థులు రాసిన ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్​ ప్రక్రియ ఏర్పాట్లు ప్రారంభించింది. మరో నాలుగు నెలల్లో ఫలితాలు ఇచ్చేందుకు చర్యలు మొదలు పెట్టింది.  ప్రస్తుతం ఇంటర్వ్యూలు లేకపోవడంతో మెయిన్స్​ పరీక్షల్లో వచ్చిన మార్కులే కీలకంగా మారనున్నాయి. దీంతో వాల్యుయేషన్ ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించేలా టీజీపీఎస్సీ చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 19న గ్రూప్–1 నోటిఫికేషన్ ఇవ్వగా, జూన్ 9న  ప్రిలిమ్స్ ఎగ్జామ్​ నిర్వహించారు. 

ఈ పరీక్షకు మొత్తం 4.03 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 3.02 లక్షల మంది హాజరయ్యారు. ఇందులోంచి ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 31,382 మందిని గ్రూప్–1 మెయిన్స్​ కు ఎంపిక చేశారు. కొన్ని కేటగిరీల్లో తక్కువ మంది ఎంపికైతే.. ఆయా కేటగిరీల్లో కింది నుంచి పికప్ చేశారు.  కాగా, ఈ నిర్ణయంపై ఆందోళనలు జరుగుతుండడంతోపాటు కోర్టు కేసులూ అభ్యర్థులను గందరగోళానికి గురిచేశాయి. చివరికి హైకోర్టు నుంచి స్టే రాకపోవడంతో.. ఈ నెల 21 నుంచి 27 వరకు  గ్రూప్–1 మెయిన్స్ నిర్వహించారు.  పరీక్షలన్నీ ప్రశాంతంగా ముగియడంతో టీజీపీఎస్సీ అధికారులతో పాటు ప్రభుత్వ పెద్దలూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, నవంబర్  20న హైకోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ రానున్నట్టు అధికారులు చెప్తున్నారు. 

ఇంగ్లిష్ లో క్వాలిఫై అయితేనే..

గ్రూప్–1 మెయిన్స్ కు మొత్తం 31,403 మంది హాజరు కావాల్సి ఉండగా, అన్ని పరీక్షలు రాసింది కేవలం 21,093 (67.17%) మంది మాత్రమే. మొత్తం ఏడు పరీక్షలు జరిగినా.. ఆరు పరీక్షల మార్కులను  మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.  తొలిరోజు 21న నిర్వహించిన క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ జనరల్ ఇంగ్లిష్ కీలకం. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థుల మిగతా పేపర్లను మాత్రమే వాల్యుయేషన్​ చేస్తారు.  ఈ నెల 26న జరిగిన పేపర్-–5 (సైన్స్, టెక్నాలజీ, డేటా ఇంటర్‌‌ప్రిటేషన్) టఫ్ గా వచ్చిందని, రిజల్ట్ లో ఇది కీలకంగా మారనుందని అభ్యర్థులు చెప్తున్నారు. ఆరు పరీక్షలకు 900 మార్కులుంటాయి. అయితే, ప్రస్తుతం ఇంటర్వ్యూల ప్రక్రియ లేకపోవడంతో, రాత పరీక్షల్లో వచ్చే మార్కులే కీలకం కానున్నాయి. 

అత్యంత రహస్యంగా వాల్యుయేషన్

ప్రస్తుత వాల్యుయేషన్ ప్రక్రియను కమిషన్ అధికారులు అత్యంత రహస్యంగా నిర్వహించనున్నారు. ఆయా ఆన్సర్ షీట్లను సీనియర్ ప్రొఫెసర్లతో వాల్యుయేషన్ చేయించనున్నట్టు సమాచారం. అభ్యర్థులు ఎక్కువ మంది ఉండడంతో ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం మూడు నుంచి నాలుగు నెలల టైమ్ పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరిలో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే గ్రూప్–1 పై హైకోర్టులో కేసులు ఉండడంతో, ఈ ఫలితాలన్నీ న్యాయస్థానం తీర్పునకు లోబడే ఉండే అవకాశం ఉంది.