రాష్ట్రంలో 48.98 లక్షల పాత వాహనాలు : మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్రంలో 48.98 లక్షల పాత వాహనాలు : మంత్రి పొన్నం ప్రభాకర్
  •  వెహికల్​ స్క్రాపేజీ పాలసీ విజయవంతంగా అమలు
  •     ఆర్టీసీలో 15 ఏళ్లు దాటిన వాహనాలు స్క్రాప్‌‌కే
  •     వాటి స్థానంలో కొత్త బస్సుల కొనుగోలు
  •     15 ఏండ్లు దాటిన స్కూల్ బస్సులకు అనుమతి లేదు
  •     మండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్ వివరణ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వాహనాల స్క్రాపేజీ పాలసీని ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్​ వెల్లడించారు. మంగళవారం శాసన మండలిలో బీఆర్ఎస్​ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు.  ఆర్టీసీలో 15 ఏళ్లు దాటిన వాహనాలను స్క్రాప్‌‌కు పంపుతూ, వాటి స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నామని  తెలిపారు. గతేడాది 4,285 ప్రభుత్వ వాహనాలు స్క్రాప్  చేశామన్నారు.  ప్రైవేట్ వాహనాల్లో దాదాపు 2 వేల వాహనాలు స్క్రాప్  అయ్యాయని చెప్పారు. 

అలాగే 15 ఏళ్ల దాటిన స్కూల్  బస్సులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 15 సంవత్సరాలు దాటిన వాహనాలు కండిషన్  బాగుంటే రిజిస్ట్రేషన్  రెన్యువల్  చేసుకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 48.98 లక్షల పాత వాహనాలు ఉండగా, వాటిలో హైదరాబాద్‌‌లోనే 16 లక్షల వాహనాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మూడు రిజిస్టర్డ్  వెహికల్  స్క్రాపింగ్  ఫెసిలిటీస్ (ఆర్​వీఎస్ఎఫ్​) పనిచేస్తున్నాయని తెలిపారు. 

‘రంగారెడ్డి జిల్లా కొత్తూరు, సిద్ధిపేట జిల్లా వర్గల్, సంగారెడ్డి జిల్లా పాశమైలారం ప్రాంతాల్లో ఇవి ఏర్పాటు చేశాం. 2025 నుంచి ఈ కేంద్రాలు పూర్తి స్థాయిలో పని చేస్తుండగా, ఇప్పటి వరకు మొత్తం 6,278 వాహనాలు స్క్రాప్  చేశాం. స్క్రాపింగ్‌‌ను ప్రోత్సహించేందుకు రాయితీలు అమలు చేస్తున్నం’ అని మంత్రి పేర్కొన్నారు.