- సుపరిపాలనలో మోతుకుపల్లి.. మహిళా సాధికారతలో ఫసల్వాడి మేటి
- రెండింటికీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు
హైదరాబాద్, వెలుగు: గ్రామీణాభివృద్ధి, సుస్థిర పరిపాలనలో రాష్ట్రంలోని రెండు గ్రామాలు జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలను కైవసం చేసుకున్నాయి. వికారాబాద్ జిల్లా మోతుకుపల్లి, సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి పంచాయతీలు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఈ గౌరవాన్ని దక్కించుకున్నాయి. మోతుకుపల్లి గుడ్ గవర్నెన్స్(సుపరిపాలన) విభాగంలో అవార్డుకు ఎంపికైంది.
గ్రామ స్థాయిలో పారదర్శక పాలన అందించడంతోపాటు, అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల అమలులో చూపిన చొరవను కేంద్రం గుర్తించింది. అలాగే, సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి పంచాయతీ మహిళా స్నేహపూర్వక పంచాయతీ విభాగంలో అవార్డు సాధించింది. మహిళల భద్రత, సాధికారత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతోపాటు సంక్షేమ కార్యక్రమాల అమలులో చేసిన విశేష కృషి గానూ పురస్కారం దక్కింది.
మంత్రి సీతక్క అభినందనలు
జాతీయ స్థాయిలో అవార్డులు రావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలవడం గర్వ కారణమన్నారు. పారదర్శక పాలన, మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఈ అవార్డులే నిదర్శనమని పేర్కొన్నారు. పురస్కారాలు సాధించిన మోతుకుపల్లి, ఫసల్వాడి గ్రామస్తులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఇతర పంచాయతీలు కూడా అభివృద్ధి బాటలో పయనించాలని మంత్రి సూచించారు.
