
- రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడి
- ఇయ్యాల ఎల్లో అలర్ట్.. రేపట్నుంచి మూడ్రోజులు ఆరెంజ్ అలర్ట్
- 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్న ఐఎండీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం ఎల్లో అలర్ట్, మంగళవారం నుంచి మూడ్రోజులకు ఆరెంజ్అలర్ట్జారీ చేసింది. ఈ మేరకు ఆదివారం బులెటిన్ విడుదల చేసింది. సోమవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో.. మిగతా జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అందులో పేర్కొంది.
ఇక మంగళ, బుధవారాల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, హైదరాబాద్, మేడ్చల్మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో.. గురువారం మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మిగతా జిల్లాల్లోనూ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. గాలులుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ క్రమంలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.
20 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా..
రాష్ట్రంలో ఆదివారం 20 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అందులో ఐదు జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదు కాగా.. అత్యధికంగా నిజామాబాద్జిల్లా మెండోరాలో 41.9, నిర్మల్‌జిల్లా బాసరలో 41.8, జగిత్యాల జిల్లా గోధూరులో 41.5, నల్గొండ జిల్లా బుగ్గబావి గూడలో 41.4, మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో 41 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదయ్యాయి. మరో 13 జిల్లాల్లో 39 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా వికారాబాద్‌జిల్లా మర్పల్లిలో 39, నారాయణపేట జిల్లా కృష్ణలో 39.1 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదయ్యాయి.