రాఖీ పండగకు ఊరెళ్లారా..? ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్.. జర జాగ్రత్త

రాఖీ పండగకు ఊరెళ్లారా..? ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్.. జర జాగ్రత్త

హైదరాబాద్: రాఖీ పండగకు నగరాలు, పట్టణాల నుంచి సొంతూళ్లకు వెళ్లిన పబ్లిక్ వర్షాకాలం కావడంతో వాతావరణాన్ని కూడా ఓ కంట కనిపెట్టుకుంటూ ఉండటం మంచిది. నేడు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది. 

దక్షిణ కోస్తాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఈ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. పలు జిల్లాలకు భారీ వర్షాలు చెప్పిన వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఈరోజు అదిలాబాద్, నిర్మల్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

ALSO READ : భూమిపై ఒక్కసారిగా వరదలు ఎలా వస్తాయి..

మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వాతావరణ పరిస్థితులను అనుసరించి ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడం బెటర్. లేకపోతే.. భారీ వర్షంలో చిక్కుకుని ట్రాఫిక్తో నరకం చూడటం ఖాయం.