జగిత్యాల, వెలుగు: సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా ప్రభుత్వం 1.15 కోట్ల మందికి వర్తించేలా ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. సామాన్యులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక హెల్త్ కార్డులు అందజేస్తున్నామని, అలాగే ఫస్ట్ క్లాస్ నుంచి జూనియర్ కాలేజీ విద్యార్థుల వరకు అందరికీ పౌష్టికాహారం అందించే లక్ష్యంతో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ను అమలు చేస్తున్నామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ఎక్కువ నిధులు కేటాయిస్తూ, తెలంగాణకు తక్కువ నిధులు కేటాయించడం సరికాదన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టిందని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ లు రాజకీయ ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నాయని, ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదన్నారు.
