రాష్ట్రంలో 35 నుంచి 40 ఏండ్లలోపు వితంతువులు 3.5 లక్షల మందికిపైనే

రాష్ట్రంలో 35 నుంచి 40 ఏండ్లలోపు వితంతువులు 3.5 లక్షల మందికిపైనే
  • రాష్ట్రంలో పెరుగుతున్న వితంతువులు
  • లిక్కర్​ మత్తులో, యాక్సిడెంట్లలో చనిపోతున్న ఇంటి పెద్దలు
  • 35 ఏండ్లలోపు వితంతువులు లక్ష మందికిపైనే
  • 40 ఏండ్లలోపు వితంతువులు 2.5 లక్షల మంది
  • వృద్ధాప్య పింఛన్ల కన్నా వితంతు పింఛన్లు ఎక్కువ
  • మూడేండ్లుగా కొత్త పింఛన్లు మంజూరు చేయని సర్కారు
  • డబుల్​బెడ్రూం ఇండ్లలో తమకు ప్రయారిటీ ఇవ్వాలని వితంతువుల వేడుకోలు

నెట్​వర్క్ / నల్గొండ, వెలుగు: రాష్ట్రంలో చిన్నవయసులోనే తోడును కోల్పోయి మహిళలు దిక్కులేనివారవుతున్నారు. కుటుంబపోషణకు అష్టకష్టాలు పడుతున్నారు. గత కొన్నేండ్ల నుంచి చూస్తే లిక్కర్ మత్తులో, యాక్సిడెంట్లలోనే చాలా మంది మహిళల భర్తలు చనిపోయారు. విడో పింఛన్ల లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం14.5 లక్షల వితంతువులు ఉండగా.. అందులో 1,06,641 మంది 35 ఏండ్లలోపు వాళ్లే ఉన్నారు. 40 ఏండ్లలోపువాళ్లు 2.5లక్షల మంది వరకు ఉన్నారు.  రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్ల కంటే వితంతు పింఛన్లే ఎక్కువ ఇస్తున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి.

లిక్కర్​ను కంట్రోల్​ చేయాల్సిన ప్రభుత్వం.. మరింత ప్రోత్సహిస్తున్నదని, గల్లీ గల్లీకి వైన్స్, బెల్ట్​ షాపులు తెరిచి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నదని మహిళలు మండిపడుతున్నారు. తాగుడుకు బానిసై కొందరు.. మద్యం మత్తులో బండ్లు నడిపి యాక్సిండెట్ల పాలై ఇంకొందరు చనిపోతున్నారని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 40 ఏండ్లలోపు పెండ్లయిన మగవాళ్ల మరణాలకు ప్రధాన కారణాలు లిక్కర్​, యాక్సిడెంట్లు, సూసైడ్లు కనిపిస్తున్నాయి. 35% మంది తాగుడుకు బానిసై, ఇతర మత్తుపదార్థాలకు బానిసై చనిపోతుండగా.. 45%  మంది అనారోగ్య కారణాలు, ఆత్మహత్యలతో కన్నుమూస్తున్నారు. మరో 20% మంది రోడ్డు యాక్సిడెంట్లలో ప్రాణాలు కోల్పోతున్నారని క్రైం రికార్డ్స్​ చెప్తున్నాయి. ఇందులో లిక్కర్​ను, యాక్సిడెంట్లను కంట్రోల్​ చేయాల్సిన సర్కారు ఆ బాధ్యతను గాలికి వదిలేసింది. యాక్సిడెంట్ల కంట్రోల్​కు పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పూర్తిస్థాయిలో ఫలితం కనిపించట్లేదు.

రాష్ట్రంలో 2020లో 16,898 యాక్సిడెంట్లలో 6,033 మంది చనిపోతే, గతేడాది  19,248 యాక్సిడెంట్లలో 6,690 మంది కన్నుమూశారు. చనిపోతున్న వాళ్లలో 50 శాతానికిపైగా 20 నుంచి 40 ఏండ్ల మధ్య వయస్సున్న వాళ్లు ఉన్నారు.  50 నుంచి 60% యాక్సిడెంట్లకు డ్రంక్​ అండ్​ డ్రైవ్​లే కారణమని పోలీస్​ ఇన్వెస్టిగేషన్లలో తేలుతున్నా సర్కారు మాత్రం లిక్కర్​ కంట్రోల్​కు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. పైగా ఆబ్కారీశాఖకు ఏటా సేల్స్ ​టార్గెట్లు పెంచుతూ, ఖజానా నింపుకుంటున్నది. 2020లో రోజుకు రూ.74 కోట్ల లిక్కర్ ​అమ్మితే 2021లో అది రూ.82 కోట్లకు చేరింది. లిక్కర్​ ద్వారానే  సర్కారు గతేడాది రూ.30 వేల కోట్లు సంపాదించింది. ఊరూరా బెల్టు షాపులను ప్రోత్సహిస్తుండడంతో తాగుడుకి బానిసై రోడ్డు యాక్సిడెంట్లలో కొందరు, మత్తులో సూసైడ్స్ ​చేసుకొని కొందరు ప్రాణాలు వదులుతున్నారు. తాగుడు కారణంగా ఆర్థిక సమస్యలతో సూసైడ్​ చేసుకునేవాళ్లు, లివర్​ ఫెయిల్యూర్, ఇతరత్రా అనారోగ్య సమస్యలతో కన్నుమూస్తున్న వాళ్లకూ లెక్కలేదు.
కుటుంబ పోషణకు అష్టకష్టాలు 
రాష్ట్రంలో ప్రస్తుతం సర్కారు ఇస్తున్న వృద్ధాప్య పింఛన్ల కంటే వితంతు పింఛన్లే ఎక్కువ ఉంటున్నాయి. 12.05 లక్షల మందికి వృద్ధాప్య పింఛన్లు ఇస్తుండగా, 14.50 లక్షల మంది వితంతు పింఛన్లు తీసుకుంటున్నారు.  వీరిలో 50 ఏండ్లలోపు వయస్సు ఉన్న విడోలు ఏకంగా 5 లక్షల 68 వేల 563 మంది ఉన్నారు. కొత్తగా 1,59,482 మంది విడో పింఛన్ల కోసం అప్లయ్​ చేసుకున్నారు. ప్రభుత్వం మూడేండ్లుగా ఎవరికీ కొత్త పింఛన్లు ఇవ్వకపోవడంతో వీరంతా ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఇక చిన్న వయస్సులో భర్తలను కోల్పోయిన పేద వితంతువుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంటోంది.

మగవాళ్లతో పోల్చినప్పుడు వేతనాలు, కూలి తక్కువగా ఉండడం, ఇద్దరికి బదులు ఒక్కరే పని చేయాల్సి రావడంతో పిల్లలను పెంచడం, చదివించడం, పెండ్లిళ్లు చేయడం కష్టమవుతున్నది. భర్త తాగుడుకు బానిసయ్యో, వివిధ వ్యాధులతోనో చనిపోయిన కుటుంబాలైతే పూర్తిగా చితికిపోతున్నాయి. అప్పట్లో వాళ్ల ట్రీట్​మెంట్​ కోసం లక్షలు ఖర్చు చేయడంతో ఆ అప్పులు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. కూలినాలి చేయగా వచ్చిన పైసలు నెలనెలా మిత్తీలు కట్టేందుకే సరిపోతున్నాయని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొంతమంది తమ పిల్లలను చదువు మాన్పించి, పనిలో పెడ్తున్నారు. వ్యవసాయ భూమి, సొంత ఇండ్లు లేనివాళ్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఎంత పనిచేసినా  బట్ట, పొట్ట వరకే సరిపోతుండడంతో తమకంటూ ఓ గూడు ఏర్పాటు చేసుకోవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ​బెడ్రూం ఇండ్ల కోసం తీసుకున్న అప్లికేషన్లలో ప్రతి మండలం నుంచి కనీసం 500 నుంచి 1000 అప్లికేషన్లు విడోస్​ నుంచే ఉంటున్నాయని ఆఫీసర్లు చెప్తున్నారు. తమకు మగ దిక్కులేనందున ఫస్ట్​ ప్రయారిటీ కింద డబుల్ బెడ్​రూం ఇండ్లు ఇప్పించాలని వారు రిక్వెస్ట్​ చేస్తున్నా ​సర్కారు మాత్రం పట్టించుకోవట్లేదు.  
కొడుకును బడి మాన్పించిన
నా భర్త బబ్బిలయ్య రిక్షా తొక్కి కుటుంబాన్ని పోషిస్తుండె. తాగుడుకి బానిసై చనిపోయిండు. మాకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు. మా ఆయన చనిపోయినప్పటి నుంచి కూలి పనికిపోతున్నా ఆ పైసలు ఏమూలకూ చాల్తలేవు. వితంతు పింఛన్ రూ.2 వేలు వస్తే ఇంట్లో సామాన్లకే సరిపోతున్నయ్​. చదివించే స్థోమత లేకపోవడంతో నా కొడుకును చదువు మాన్పించి.. కూలి పనికి పంపిస్తున్న. అప్పుడప్పుడు వచ్చే రోగాలు, మీద పడే ఖర్చులకు అప్పులు చేయక తప్పుతలేదు. - బొంగరాల వెంకటమ్మ (35), హాలియా
16 ఏండ్లకు పెండ్లి.. 19 ఏండ్లకు భర్తకు దూరం.. 
నాకు 16 ఏండ్ల వయస్సులోనే పెండ్లయింది. 19 ఏండ్ల వయసు వచ్చేసరికి ఏడాది బాబుతో పాటు ఐదు నెలల గర్భిణిగా ఉండగా.. నా భర్త ఆర్థిక ఇబ్బందులతో పురు గుల మందు తాగి చనిపోయిండు. అప్పటి నుంచి ఇప్పటివరకు పిల్లల కోసమే బతుకు తున్న. దొరికినపనల్లా చేసి వాళ్లను పెంచుతున్న. నాలాంటి బాధ ఏ తల్లికీ రాకూడదు.  - కందుకూరి సుజాత (38), ముదిగొండ, ఖమ్మం జిల్లా

సారాకు బానిసై చనిపోయిండు
నా భర్త మల్లేశ్వరరావు తాపీ మేస్త్రీగా పనిచేస్తూ.. సారాకు బానిసై చనిపోయిండు. నాకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నరు. కూలీ పని చేసుకుంటూ, కిరాయి ఇంట్లో ఉండి పిల్లల్ని పోషించుకుంటున్న.రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే బట్ట, పొట్టకు కూడా చాల్తలేవు. నా లాంటి భర్త కోల్పోయిన ఆడవాల్లకు సర్కారు డబల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలి.  - పెరబోయిన ఉమ (32), ప్రకాశ్ నగర్, ఖమ్మం.
దిక్కులేనోళ్లమైనం 
నా భర్త నేత పని చేస్తుండె. తాగుడుకు బానిసై ఆయన ఆరోగ్యం దెబ్బ తినడంతో అప్పులు చేసి ట్రీట్​మెంట్​ చేయించిన. లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా బతకలేదు. ఆరేండ్ల కింద ఆయన చనిపోవడంతో దిక్కులేని వాళ్లమైనం. నాకు ముగ్గురు ఆడ పిల్లలు. సొంత ఇల్లు లేదు. భూమి లేదు. పైగా అప్పులున్నయ్​. నేత మగ్గాలకు అచ్చులు అతుకుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న. పిల్లల భవిష్యత్తు ఏందో అర్థమైతలేదు. ‑ అవ్వారి లలిత, తేరటుపల్లి, చండూరు మండలం , నల్గొండ జిల్లా